సినిమా మనుగడ ఆగిపోనుందా..?Digital-industry
2018-07-20 13:51:38

అరచేతిలో ప్రపంచం(సెల్ ఫోన్) ఉన్న కాలం ఇది. దాంతో పాటే ఆనందం కూడా చేతిలోనే ఉంది. యువత సోషల్ మీడియాతో ఎంత అటాచ్డ్ గా ఉందో.. యూ ట్యూబ్ తోనూ అంతే అటాచ్డ్ గా ఉంది. మరోవైపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వీడియో ఫార్మాట్స్ లో వస్తోన్న మార్పలకు అనుగుణంగా అప్ గ్రేడ్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫార్మాట్ లో టివిల కంటే ఎక్కువగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ వంటి స్ట్రీమింగ్ సర్వీసెస్ లో సినిమాలు చూడ్డానికి అలవాటు పడుతున్నారు.. పైగా సినిమాలు విడుదలైన అతి తక్కువ టైమ్ లోనే తమ వీడియో ఫార్మాట్ లో అప్ లోడ్ చేస్తున్నాయీ స్ట్రీమింగ్ సర్వీసెస్. దీంతో చాలామంది సినిమాలకు వెళ్లడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేది నిజం. కారణం.. ఈ సంస్థలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆయా సినిమాలు అప్ లోడ్ చేస్తున్నాయి. నెలకు కేవలం వెయ్యి రూపాయల గరిష్ట ఫీజ్ తో ఈ సినిమాలు ఆయా ఫార్మాట్స్ లో చూడొచ్చు. అంటే ఇంట్లో అంతా కలిసి హ్యాపీగా ఈ సినిమాలు చూడొచ్చు. హోమ్ థియేటర్ ఉన్నవారికి ఇది ఇంకా యూజ్ ఫుల్ గా ఉంది. అలాగే కుటుంబం అంతా కలిసి ఎప్పుడు కావాలన్నా సినిమా చూసే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఎవరు మాత్రం రిలీజ్ రోజునే సినిమాలు చూడ్డానికి ఎగబడతారు. పెద్ద స్టార్స్ అయితే తప్ప ఇప్పుడు ఫస్ట్ డే సినిమాకు పెద్ద రష్  ఉండటం లేదు. మీడియం రేంజ్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు కూడా మల్టీప్లెక్స్ ల్లో మాగ్జిమం సీట్స్ ఖాళీగానే కనపిస్తున్నాయి. 

నిజానికి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గిపోయి చాలా కాలమైంది. ఒకప్పుడు సినిమాకు వెళ్లాలంటే అదో ఫ్యామిలీ అకేషన్ లా ఉండేది. దీంతో కుటుంబం అంతా కలిసి హాయిగా సినిమా చూసి వచ్చేవారు. ఇది ఒక్క కుటుంబానికే పరిమితం కాదు.. ఆ వీధి మొత్తమో, లేక ఊరిలోని తమ బంధుగణం మొత్తమో కలిసి వెళ్లేవారు. అందుకే అప్పుడు సినిమా వెలిగిపోయింది. ఇక గత దశాబ్ధంన్నర కాలంగా ఈ టైప్ ఆడియన్స్ మాగ్జిమం దూరమయ్యారు. కారణం టివిలు రావడం. అందులో సీరియల్స్ సినిమాలను మించే రీతిలో ఉండటంతో ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సినిమాకు సెకండరీ ప్రియారిటీ ఇవ్వడం మొదలైంది. ఏదైనా సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చి.. మహిళలను మెప్పించే అంశాలున్నాయనే టాక్ వస్తే తప్ప వాళ్లు ఇల్లుదాటి సినిమా థియేటర్ కు రావడం లేదు. అందువల్ల థియేటర్స్ కూడా చాలా వరకూ మూతపడ్డాయి.. పడుతున్నాయి. మరోవైపు కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు కూడా తగ్గిపోవడం కూడా మరో కారణం. ఒక వర్గం ప్రేక్షకులనైనా ఆకట్టుకుంటూ ఇప్పుడిప్పుడే నవ్యపథంలో ప్రయాణిస్తోన్న మన సినిమాకు ఇప్పుడీ స్ట్రీమింగ్ సర్వీసెస్ పెద్ద దెబ్బగా మారింది. ముందు దీన్ని కూడా ఓ ఆదాయవనరుగా చూశాయి.. అన్ని సినిమా పరిశ్రమలు. కానీ ఇప్పుడిది ఏకంగా సినిమా మనుగడకే గొడ్డలిపెట్టుగా మారబోతోందా అనే ప్రశ్నలు మెల్లగా ఉత్పన్నం అవుతున్నాయి. 

ఉదయం సినిమా విడుదలైతే సాయంత్రానికే పైరసీ అవుతోంది. ఒక్కసారి సినిమా డౌన్ లోడ్ అయిందా.. ఇక అది షేర్ అవుతూనే ఉంటుంది. బస్ లోనో, ట్రెయిన్ లోనో వెళుతూ సెల్ ఫోన్ లోనే పైరసీ సినిమాలు చూసేవారిని చాలామందిని చూస్తున్నాం. ఇక అది కాస్తా లాప్ ట్యాప్ గా మారడానికి ఎక్కువ టైమేం పట్టదు. అప్పుడు ఖచ్చితంగా ప్రతి కంప్యూటర్ లో ఈ నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ వంటి స్ట్రీమింగ్ సర్వీసెస్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటూ.. హ్యాపీగా, ‘లీగల్’గా సినిమాలు చూసేయొచ్చు. పైగా ఒక్క భాష మాత్రమే కాదు.. ఏ భాషలో సినిమా అయినా చూడొచ్చు. నెట్ కోసం సామాన్యుడు కూడా ఖర్చుకు వెనకడాని రోజులివి. పైగా జియో వచ్చిన తర్వాత ఆ ఖర్చులు కూడా తగ్గాయి. అన్నట్టు జియో నుంచి కూడా ఇలాంటి సర్వీస్ మొదలవబోతోంది. ఇది మొదలైతే ఈ రేట్లు ఇంకా తగ్గుతాయి. అప్పుడు సినిమా కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడుతుంది.. 

ఇక ఇవన్నీ ఒకెత్తైతే.. ఇప్పుడు వెబ్ సిరీస్ లు మరో ఎత్తు. సినిమాలను తలదన్నే రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయీ సిరీస్ లు. మరి అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు. వీటికి ఆదరణ ఉంది కాబట్టి. ఎక్కడ ఉంది.. ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ లో. సో.. సినిమానే చూడాలి అనేం లేదు.. వెబ్ సిరీస్ లు చూసినా చాలు. పైగా కొన్ని మసాలాలకు ఈ ఫార్మాట్ లో సెన్సారింగ్ లేదు. దీంతో ఇప్పుడు సినిమాలు చూస్తోన్న యువత కూడా ఈ వెబ్ సిరీస్ లకు అడిక్ట్ కావడానికి పెద్ద విషయం కాదు. ఏదేమైనా తొలుత ‘మంచి’ఆదాయ వనరుగా కనిపించిన ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమలను ‘ముంచు’తాయి అనేది విశ్లేషకుల అంచనా. వీటికి అడ్డుకట్ట వేసే హక్కు ఎవరికీ లేదు. వేయలేరు కూడా. మరి సినిమా బ్రతకాలంటే ఖచ్చితంగా కంటెంట్ ను నమ్మాలి. స్టార్స్ పై కాకుండా స్టోరీస్ పై ఆధారపడాలి. బడ్జెట్ విషయంలో పరిమితులు పెంచుకోవాలి. ఇలా ఎన్నో చేస్తే తప్ప ఈ స్ట్రీమింగ్స్ అండ్ సిరీస్ ల నుంచి సినిమా తన మనుగడ కాపాడుకోలేదు.. ప్రస్తుతం అంత ప్రభావం లేదు కాబట్టి.. దీని పర్యవసానం పెద్దగా అంచనా వేయలేకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇది ఇంటి థియేటర్ కాబోతోంది. ఇక అప్పుడు వీథి థియేటర్ వైపు ఎందుకు వస్తారు..? 

More Related Stories