తమన్ నీ టైమ్ నడుస్తుంది.. నడిపించు భాయ్.. Jr NTR
2020-03-20 17:21:54

ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది చూస్తుంటే. అల వైకుంఠపురములో సినిమాతో తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తమన్. 100 సినిమాల తర్వాత ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాలకు సంగీతం అందించినా కూడా ఈయనకు కాపీ క్యాట్.. రొటీన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరుండేది. కానీ అల వైకుంఠపురములో తర్వాత తమన్ రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమాకు తొలి విజయం చేకూరేలా చేసింది తమనే. 

ఎందుకు మీరు టికెట్ కొనరు అంటూ ప్రశ్నించేలా తన సినిమాకు సంగీతం అందించిన తమన్ కు చేతులెత్తి నమస్కరించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గత మూడేళ్లుగా మహానుభావుడు, తొలిప్రేమ, ఛల్‌ మోహన్‌రంగ, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు సంగీత దర్శకుడు తమన్‌.  సరైనోడు తర్వాత ఏడాది విరామం తీసుకున్నానని.. ఆది తనకెంతగానో ఉపయోగపడిందని చెబుతున్నాడు ఈయన. ఆ సమయంలోనే ఇలాంటి సినిమాలు ఒప్పుకోవాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తమన్. ఇక గత రెండు నెలలుగా ఏ సినిమా పోస్టర్ పై చూసినా కూడా ఈయన పేరు కనిపిస్తుంది. 

వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, అల వైకుంఠపురములో సినిమాలతో మరోసారి తన సత్తా చూపించాడు ఈయన. వీటితో పాటు తమన్ చేతిలో మరో అరడజను ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నాడు. తన జోరు చూస్తుంటే ఏడాదికి 15 సినిమాలకు సంగీతం అందించేలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఒకప్పుడు దేవీతో వరస సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు.. అరవింద సమేత నుంచి తమన్ తోనే ప్రయాణం అంటున్నాడు. ఆ సినిమాకు మంచి సంగీతం అందించి.. అల వైకుంఠపురములో సినిమాను కేవలం తన పాటలతోనే హిట్ చేసాడు ఈయన. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా ఈయన్నే తీసుకుంటున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి మరో రెండు మూడేళ్ల వరకు కూడా తమన్ దూకుడు తగ్గేలా కనిపించట్లేదు. 

More Related Stories