నా కొడుకుని శవంలా చూడలేకపోయా.. కానీ వారం రోజుల్లోనే..Kota Srinivasa Rao
2020-09-11 09:13:37

చెట్టంత కొడుకు కళ్ళముందు కన్నుమూయడం కంటే దారుణం మరొకటి ఉండదు. చేతికి అంది వచ్చిన కొడుకు.. తనను బాగా చూసుకుంటాడని నమ్మిన కుమారుడు ప్రాణాలు కోల్పోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. అలాంటి కడుపుకోత ఎవరికీ ఉండకూడదు అంటున్నాడు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. పదేళ్ల కింద ఈయన కొడుకు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ చేదు సంఘటన గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడు. అసలు ఇప్పుడు ఏం జరిగింది అనే విషయం మరోసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కోట శ్రీనివాసరావు. ఈ మధ్య కాలంలో సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయాడు ఈ సీనియర్ నటుడు. తనకు నటించాలనే ఆసక్తి ఉన్నా కూడా చాలా మంది దర్శక నిర్మాతలు కనీసం పట్టించుకోవడం లేదు అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు ఈ లెజెండరీ నటుడు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కోట ఇప్పుడు మాత్రం అవకాశాల కోసం చూస్తున్నాడు. ఇదిలా ఉంటే తన కొడుకు మరణం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు కోట. గాయం 2 సినిమాలో ఆంజనేయ ప్రసాద్ విలన్ గా నటించాడు. జగపతిబాబు హీరోగా వచ్చిన ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయితే ఇందులో కోట శ్రీనివాస రావు కొడుకు ఆంజనేయ ప్రసాద్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి విలన్ దొరికాడని అప్పట్లో అంతా సంబరాలు కూడా చేసుకున్నారు. 

అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆంజనేయ ప్రసాద్ ను చంపి పాడి మీద పడుకోబెట్టే ఉంటుంది. పైగా కోట శ్రీనివాసరావు తన కొడుకుకు తల కొరివి పెట్టాలి. ఆ సన్నివేశం చేస్తున్నప్పుడు కోట బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇదే విషయం హీరో జగపతిబాబుకు కూడా చెప్పానని కోట తెలిపాడు. ఎంతైనా వాడు నా కొడుకు.. వాన్ని అలా పాడే మీద నేను చూడలేకపోతున్నా.. ఈ సన్నివేశం నేను చేయలేను అంటూ జగపతిబాబుకు చెప్పాడు కోట శ్రీనివాసరావు. ఆయన ఎమోషన్ అర్థం చేసుకున్న హీరో ఈ ఒక్క సన్నివేశాన్ని డూప్ తో చేసేద్దాం అని చెప్పాడు. అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన వారం రోజుల తర్వాత నిజంగానే రోడ్డు ప్రమాదంలో ఆంజనేయప్రసాద్ చనిపోయాడు. తన కళ్ళ ముందే ఎదిగిన కొడుకు చనిపోవడంతో కోట శ్రీనివాసరావు బాగా కృంగిపోయాడు. ఇలాంటి దారుణమైన స్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాడు ఈయన. తన కొడుకు చనిపోయిన తర్వాత కోడలును కూతురుగా చూసుకుంటుందని.. తనకు ఇప్పుడు ఇద్దరు కొడుకులు కాదు ముగ్గురు అని చెబుతున్నాడు కోట. 

More Related Stories