మత్తు వదలరా సినిమా రివ్యూMathu Vadalara Review
2019-12-25 19:20:49

దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు హీరోగా, పెద్ద కొడుకు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మత్తు వదలరా. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ నిన్న హైదరాబాద్ లో ప్రదర్శించారు. ఈ సినిమాకి మొదటి నుండి పెద్దగా అంచనాలు లేకున్నా సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక అంచనాలు పెరిగాయి. అందునా రాజమౌళి తన షూటింగ్ సెలవు ఇచ్చి మరీ ఈ సినిమాకి వెళ్తున్నా అని చెప్పడం వంటివి సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాయి. మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంది ? ఏర్పడిన అంచనాలను ఈ సినిమా అందుకుందా ? అంటే ఈ రివ్యూ చదవండి.

కధ :

బాబు మోహన్‌(శ్రీసింహా), ఏసుదాస్‌(సత్య), అభి(అగస్త్య)లు రూమ్‌ మేట్స్‌. బాబు, ఏసుదాస్‌లు డెలీవరీ బాయ్స్‌గా పనిచేస్తుంటే అభి మాత్రం వచ్చిన ప్రతి కొత్త సినిమా పైరసీ చూస్తూ కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. అయితే నెలంతా కష్టపడినా ఐదు వేలు కూడా రాకపోవడంతో ఊరికి వెళ్లిపోవాలని అనుకుంటాడు బాబు. అయితే బాబుకు ఏసుదాస్‌ ఓ ఉపాయం చెబుతాడు ఈజీగా డబ్బు సంపాదించేందుకు. ఆ సలహా పాటించిన బాబు అనుకోని చిక్కుల్లో పడతాడు. ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఏసుదాస్‌ ఇచ్చిన ఆ ఉపాయం ఏంటి? అసలు ఈ సినిమాకి మత్తు వదలరా అనే టైటిల్‌ ఎలా వచ్చింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

రాజమౌళి కుటుంబం నుంచి వారసుడు అంటే అంచనాలు బాగానే ఉంటాయి. కావాల్సినంత కమర్షియల్ ప్యాకేజీ ఇంట్లోనే ఉండటంతో అనుకుంటే పక్క మాస్ సినిమా చేయొచ్చు కీరవాణి కుమారుడు సింహ కోడూరి. కానీ అసలు పాటలు, హీరోయిన్ లేకుండా కమర్షియల్ సినిమా అంటూ ఏదేదో ప్రయత్నించకుండా కొత్త తరహా ప్రయత్నంతో ప్రేక్షకులను మెప్పించాలని వచ్చాడు సింహా. నటుడిగా ఈ సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు ఈ కుర్రాడు. దర్శకుడు రితేష్ రానా తీసుకున్న పాయింట్ కూడా కొత్తగానే ఉంది. అయితే దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో అక్కడక్కడా తడబడినట్లు అనిపించాడు దర్శకుడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించాయి. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కాస్త లెంతీ అయింది. 2 గంటల 10 నిమిషాల నిడివి మాత్రమే ఉన్నా.. ఫస్టాఫ్ మాత్రం కొన్ని సన్నివేశాలు చాలా ల్యాగ్ అయ్యాయి. ఇంటర్వెల్ తర్వాత కథ ఆసక్తికరంగా మారింది.. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ మధ్య ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ తరహా కాన్సెప్టులు హాలీవుడ్ లో ఎక్కువగా వస్తుంటాయి. ఆ విధంగా ఈ సినిమా మంచి మార్కులే వేయించుకుందనే చెప్పాలి.  

నటీనటులు :

సింహ తొలి ప్రయత్నంగా ఇలాంటి సినిమా చేయడం అభినందనీయమే, నటుడిగా ఆయన మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక సినిమా మొదట్లో పేర్కొన్నట్టుగానే కమెడియన్ సత్య నిజంగానే ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్తగా మళ్లీ పరిచయం అయ్యాడు. చాలా సన్నివేశాలు తన భుజాలపై వేసుకొని నవ్వించాడు సత్య. కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్లకు మత్తు ఎక్కకపోవచ్చు కానీ.. రొటీన్ కి భిన్నంగా కోరుకునే ఆడియన్స్ కు ఇది మంచి ఛాయిస్.

ఫైనల్ గా : ఓవరాల్ గా మత్తు వదలరా..కొత్త ప్రయత్నం అయినా తప్పక చూడాల్సిన సినిమా.

రేటింగ్: 2.75 /5.

More Related Stories