మిస్సింగ్ మూవీ రివ్యూ

నూతన నటీనటులు హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో, హీరోయన్లుగా రూపొందిన థ్రిల్లర్ మూవీ మిస్సింగ్.
ఈ చిత్రానికి శ్రీని జోస్యులు దర్శకత్వం వహించారు. భజరంగబలి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై క్యూరియాసిటీ ఏర్పడింది. ఈరోజు (నవంబర్ 19న) మిస్సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. మిస్సింగ్ ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే.. ముందుగా మిస్సింగ్ స్టోరీ చెప్పాలి.
కథ - గౌతమ్ (హర్ష నర్రా) సాఫ్ట్వేర్ ఇంజినీర్. శృతి (నికీషా రంగ్వాలా)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. అయితే.. వీరిద్దరూ అనుకోకుండా కలుసుకోవడం.. ఆతర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారడం పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఓ రోజు గౌతమ్, శృతి
కారులో బయటకు వెళుతుంటే.. ఆ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత కళ్లు తెరిచి చూస్తే గౌతమ్ హాస్పటల్ లో ఉంటాడు. శృతి మిస్ అవుతుంది.
ఓ వైపు పోలీసులు శృతి ఎలా మిస్ అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరో వైపు గౌతమ్ కూడా శృతి ఎలా మిస్ అయ్యిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. గౌతమ్, శృతిని వెంటాడిన ఐదుగురు వ్యక్తులను గుర్తిస్తాడు. ఆ వ్యక్తులను గౌతమ్ పట్టుకోవాలి అనుకునే లోపే వాళ్లు హత్యకు గురవుతుంటారు. వాళ్లను హత్య చేసింది ఎవరు..? శృతి ఎలా మిస్ అయ్యింది..? చివరికి శృతి ఏమైంది అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్
హర్ష నర్రా నటన
కథ
శ్రీని జోస్యుల దర్శకత్వ ప్రతిభ
అజయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
ప్రథమార్థం కాస్త స్లోగా ఉండడం.
విశ్లేషణ - గౌతమ్ పాత్రలో కనిపించిన హర్ష నర్రా కొత్తవాడైనప్పటికీ.. పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించాడు. లవ్ సీన్ అయినా.. ఎమోషనల్ సీన్ అయినాసరే.. ఎంతో అనుభవం ఉన్న నటుడులా నటించి మెప్పించాడు. ఇంకా చెప్పాలంటే.. వన్ మేన్ షోలా ఈ కథను ముందుకు నడిపించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. శృతి పాత్రలో ఆ పాత్ర స్వభావానికి తగ్గట్టుగా నికీషా ఒదిగిపోయింది. గౌతమ్, శృతిల కెమెస్ట్రీ బాగుందనిపించింది. జర్నలిస్టు పాత్రలో మిషా నారంగ్ తనదైన శైలిలో నటించింది. ఏసీపీ త్యాగి, సీఐ పాత్రలో రామ్ దత్, ఛత్రపతి శేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ బ్రదర్ గా విష్ణు విహారి, హీరో స్నేహితుడిగా అశోక్ వర్థన్ చక్కగా నటించారు.
ఇక దర్శకుడు శ్రీని జోస్యుల గురించి చెప్పాలంటే.. ఫస్ట్ మూవీకి ఎవరైనా లవ్ స్టోరీని ఎంచుకుంటారు కానీ.. వెరైటీగా దర్శకుడు శ్రీని థ్రిల్లర్ జోనర్ ఎంచుకున్నారు. కథను ఎంచుకోవడంలో కొత్తదనం చూపించిన దర్శకుడు తెరకెక్కించడంలో కూడా కొత్తదనం చూపించాడు. సాధారణంగా సినిమా స్టార్ట్ అయిన తర్వాత పాత్రల పరిచయం చేస్తారు. ఆతర్వాత అసలు కథలోకి వెళతారు కానీ.. ఈ కథ టైటిల్ పడడంతోనే అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు.
ఇక కథ మొదలైనప్పటి నుంచి ఊహకందని ట్విస్టులతో వాట్ నెక్ట్స్ అనేట్టుగా ఉత్కంఠతో చూసేలా ఈ కథను అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు నూటికి నూరు శాతం సక్సస్ అయ్యాడు. థ్రిల్లర్ జోనర్ లో మూవీస్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అజయ్ అరసాడ పర్ ఫెక్ట్ అనేట్టుగా సంగీతం అందించారు. డి. జానా సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ మూవీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. మిస్సింగ్ అస్సలు మిస్ అవ్వద్దు.