మిస్ట‌ర్ రివ్యూ రేటింగ్Mister-Movie-review
2017-04-14 07:46:31

వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు.. టాప్ డైరెక్ట‌ర్ హోదా నుంచి కింద ప‌డిపోయాడు.. అలాంటి టైమ్ లో వ‌రుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోతో సినిమా చేసే అవ‌కాశం. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో వ‌చ్చిన మిస్ట‌ర్ శీనువైట్ల టైమ్ ను ట‌ర్న్ చేసిందా..? అస‌లు సినిమా ఎలా ఉంది..?

క‌థ‌ : చై(వ‌రుణ్ తేజ్) యూర‌ప్ లో ఉంటాడు. అక్క‌డే ఫ్యామిలీతో క‌లిసి ఉంటాడు. అలాంటి టైమ్ లో మీరా(హెబ్బాప‌టేల్) చై జీవితంలోకి వ‌స్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు చై. ఆ త‌ర్వాత ఆమెను ఇంప్రెస్ చేయ‌డానికి ట్రై చేస్తాడు. అలాంటి టైమ్ మీరా మ‌రొక‌రి ప్రేమ‌లో ఉంద‌ని తెలిసి.. వాళ్లిద్ద‌ర్నీ క‌ల‌ప‌డానికి ఇండియా వ‌స్తాడు. అక్క‌డ చంద్ర‌ముఖి(లావ‌ణ్య త్రిపాఠి) ప‌రిచ‌యం అవుతుంది. అక్క‌డ్నుంచో మ‌రో క‌థ మొద‌లవుతుంది. అస‌లు ఏంటి ఆ క‌థ‌.. చైకి, చంద్ర‌ముఖికి ఎలా ప‌రిచ‌యం.. ఇదంతా మిగిలిన క‌థ‌.

క‌థ‌నం : ఇందులో బ‌కరా కామెడీలు ఉండ‌వు.. ఇదో నీట్ గా ఉండే ట్రావెల్ ఫిల్మ్ అన్నాడు శీనువైట్ల‌. నిజ‌మే ఇందులో బ‌క‌రా కామెడీలే లేవు. కానీ అంత‌కంటే దారుణాలే ఉన్నాయి. సినిమా ఎక్క‌డ మొద‌లై.. ఎక్క‌డ పూర్త‌వుతుందో పూర్త‌య్యే వ‌ర‌కు మ‌న‌కు కూడా తెలియ‌దు. ప‌ల్లెటూరిలో రాయ‌ల వారి కాలం బ్యాక్ డ్రాప్ గురించి శీనువైట్ల చెప్పే వాయిస్ ఓవ‌ర్ తో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ వెంట‌నే యూర‌ప్ కు షిఫ్ట్ అవుతుంది. అక్క‌డే కొన్ని స‌ర‌దా స‌న్నివేశాల‌తో క‌థ‌ను ముందుకు న‌డిపించాడు శీనువైట్ల‌. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఊపిరి స్పూఫ్.. శ్రీ‌మంతుడు సినిమాపై సెటైర్లు వేసాడు శీనువైట్ల‌. ఫ‌స్టాఫ్ ఎప్పుడు అయిపోతుందా అని వేచి చూస్తోన్న టైమ్ లో కూడా ఇంకా క‌థ న‌డుస్తూనే ఉంటుంది. సెకండాఫ్ లో ఉన్న‌ట్లుండి రాయ‌ల‌వారి కాలంలోకి క‌థ షిఫ్ట్ అవుతుంది. ఇక అక్క‌డ్నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు వైట్ల న‌డిపించిందే క‌థ‌.. క‌థ‌నం. ఆయ‌న ఇష్టం. క్లైమాక్స్ లో క‌ర్ర సాముతో సినిమా ఎండ్ అయిపోతుంది.

న‌టీన‌టులు :వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్ త‌దిత‌రులు. వ‌రుణ్ తేజ్ బాగున్నాడు.. బాగా న‌టించాడు కూడా. స‌ర‌దా కుర్రాడిగా అల‌రించాడు. కానీ క‌థే అత‌డికి స‌హ‌క‌రించ‌లేదు. ఇలాంటి క‌థ‌లో ఆయ‌న అంత‌కంటే ఏం చేయ‌లేడు కూడా. హెబ్బాప‌టేల్ గ్లామ‌ర్ షోతో బాగానే అల‌రించింది. లావ‌ణ్య త్రిపాఠి కూడా ఇంచుమించు అంతే. స‌త్యం రాజేష్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాడు. ఇక 30 ఇయ‌ర్స్ పృథ్వీ సినిమా డైరెక్ట‌ర్ గా ప‌ర్లేద‌నిపించాడు. సెకండాఫ్ లో ఒక్క సీన్ లోనే వ‌చ్చినా.. పెళ్లిచూపులు ఫేమ్ ప్రియ‌దర్శి త‌న తెలంగాణ యాస‌తో ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన వాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవాళ్లే.

టెక్నిక‌ల్ టీం : క‌థ‌: గోపీమోహ‌న్, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీ‌నువైట్ల‌. టైమ్ బ్యాడ్ అయిన‌పుడు ఏం చేసినా కలిసి రాదంటారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం కూడా అంతే. ప్ర‌తీ సినిమాలో క‌నీసం ఒకట్రెండు పాట‌లైనా అద్భుతంగా ఇస్తాడు మిక్కీ. కానీ మిస్ట‌ర్ లో అలాంటివేం క‌నిపించ‌వు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతంత‌మాత్ర‌మే. సినిమాటోగ్ర‌ఫ‌ర్ త‌న ప‌ని బాగా చేసాడు. గోపీమోహ‌న్ క‌థ చాలా సినిమాల్లో చూసిందే. శ్రీ‌ధ‌ర్ సీపాన అక్క‌డక్క‌డా త‌న పంచ్ ల‌తో న‌వ్వించాడు. శీనువైట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలిక్క‌డ‌. బ్రూస్లీ, ఆగ‌డు సినిమాలు క‌నీసం ఓ ఫార్మాట్ లో వెళ్తాయి. కానీ మిస్ట‌ర్ లో అవేవీ ఉండ‌వు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు క‌థ రాసేసి.. తీసేసాడా అన్న‌ట్లుంటుంది. ఇందులో పాజిటివ్స్ వెతుక్కోవ‌డం కాస్త క‌ష్ట‌మే.

చివ‌ర‌గా : ఓవ‌రాల్ గా ఈ మిస్ట‌ర్.. మ‌న ఆరోగ్యానికి డేంజ‌ర్..

Rating : 2/5

More Related Stories