బాలయ్య విరాళం ఇచ్చాడు.. ఎన్ని కోట్లో తెలుసా.. Nandamuri Balakrishna
2020-04-03 12:44:59

బాలయ్య ఎందుకు విరాళం ప్రకటించడం లేదు.. కొన్ని రోజులుగా చాలా మందిలో ఇదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనికి సమాధానం ఇచ్చేసాడు బాలయ్య. కాస్త ఆలస్యంగా అయినా కూడా కరోనా మహమ్మారి కారణంగా బాధ పడుతున్న సినిమా కార్మికులతో పాటు తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రుల సహాయనిధికి కూడా ఈయన విరాళం ప్రకటించాడు. అందరి మాదిరే ఈయన కూడా కోటి 25 లక్షలు విరాళంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఈయన హిందూపూర్ శాసనసభ్యుడుగా ఉన్నాడు. దాంతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అన్నింటి తరఫున ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ 1.25 కోట్లు విరాళంగా అందించారు.

అందులో కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం 25 లక్షల చెక్ ను నిర్మాత సి కళ్యాణ్ కు అందచేసారు బాలయ్య. ఇక 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి.. 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి ఇచ్చాడు ఈ హీరో. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందంటున్నాడు ఈయన. ఈ సాయం ఇక్కడితోనే అయిపోదని.. తర్వాత కూడా ఆదుకునే కార్యక్రమాల్లో తన చేయూత ఉంటుందని చెప్పాడు బాలకృష్ణ. అందరూ ఇంట్లోనే ఉండి ఈ కరోనాను దేశం నుంచి తరిమికొడదామని పిలుపునిచ్చాడు బాలయ్య. 
 

More Related Stories