జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్.. Nara Lokesh NTR
2019-09-05 18:28:46

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో అందరి చూపు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఆయన వస్తే తప్ప ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం రాదంటున్నారు కొందరు విశ్లేషకులు. ఈ మాటకు తెలుగుదేశంలోని కీలక నాయకులు కూడా సై అంటున్నారు. ఎన్టీఆర్ వస్తానంటే ఆహ్వానిస్తాం అంటున్నారు. అయితే దీనిపై చంద్రబాబుతో పాటు మరికొందరు కీలక నాయకులు మాత్రం జూనియర్ ఎంట్రీపై ససేమిరా అంటున్నారు. మొన్నటికి మొన్న బాలయ్య అల్లుడు భరత్ కూడా ఎన్టీఆర్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. పార్టీకి ఎన్టీఆర్ అవసరం లేదన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు నారా లోకేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా కచ్చితంగా పార్టీ పగ్గాలు జూనియర్ తీసుకోవాల్సిందే అంటూ కొందరు అంటున్న నేపథ్యంలో.. ఆ మధ్య నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి రోజున టీడీపీ అధినేత చంద్రబాబుతో జూనియర్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన్ని స్వయంగా బాబే టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై బాలయ్య అల్లుడు భరత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పార్టీకి తామున్నామని.. జూ ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదనే అనుకుంటున్నామని చెప్పాడు. ఇదే విషయంపై నారా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీలోకి ఎన్టీఆర్ ఎంట్రీపై మీ స్పందనేంటి అంటే అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని చెప్పాడు. పార్టీ కోసం ఎవ్వరైనా పని చేయొచ్చని.. టీడీపీ ఏ ఒక్కరిదో కాదని చెప్పాడు లోకేష్. నిజానికి పదేళ్ల కింద పార్టీ కోసం రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డాడు జూనియర్. యాక్సిడెంట్ అయితే కూడా బెడ్డుపై నుంచే ప్రచారం చేసాడు. కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు కానీ.. ఆయన తండ్రి హరికృష్ణకు కానీ పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదనే వార్తలు వచ్చాయి. దాంతో రాజకీయాలకు తాను సూట్ కానని బయటికి వచ్చేసాడు ఎన్టీఆర్. మొన్నటికి మొన్న ఎన్నికల్లో అక్క తరఫున ప్రచారం చేయడానికి కూడా ఒప్పుకోలేదు జూనియర్ ఎన్టీఆర్. 
 

More Related Stories