నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ సినిమాకు అంత డిమాండ్ చేస్తున్నాడా...Naveen Polishetty
2021-03-17 10:56:11

ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కొందరు హీరోలు చాలా ఏళ్ళ పాటు వెయిట్ చేస్తుంటారు. టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశాలు రాక ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు తమను తాము నిరూపించుకోవడానికి కష్టపడుతుంటారు. ఒక్కసారి అవకాశం వచ్చిందంటే వాళ్ళు ఏంటో ఇండస్ట్రీకి అర్థమైపోతుంది. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో మెరిశాడు నవీన్. ఆ తర్వాత యూ ట్యూబ్ కు వెళ్లి అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు. హిందీలో కూడా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. కానీ తెలుగులో మాత్రం ఆయనకు గుర్తింపు రావడానికి కాస్త ఎక్కువ టైం పట్టింది. విజయ్ దేవరకొండతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్ ఇన్నేళ్ళకు సక్సెస్ అందుకున్నాడు. 

రెండేళ్ల కింద ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తొలి విజయం అందుకున్న నవీన్ పొలిశెట్టి.. ఆ తర్వాత హిందీలో చిచోరే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో జాతిరత్నాలు సినిమాతో మరో సంచలన విజయం నమోదు చేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాను వన్ మ్యాన్ షోగా మార్చేశాడు నవీన్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ కుర్రాడి యాక్టింగ్ కు పడిపోతున్నారు. ఈయన తర్వాత సినిమా కోసం 4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జాతి రత్నాలు కనీసం 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది. ఈ మాత్రం మార్కెట్ ఉన్న హీరో 3,4 కోట్లు డిమాండ్ చేయడం తప్పేం కాదు అంటున్నారు విశ్లేషకులు కూడా. ఏదేమైనా నవీన్ జోరు చూస్తుంటే మరో రెండు హిట్లు పడితే మరో విజయ్ దేవరకొండ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈయన తర్వాత సినిమా యు.వి.క్రియేషన్స్ లో అనుష్క శెట్టి జోడిగా ఉండబోతోందని తెలుస్తోంది. రారా కృష్ణయ్య ఫేం మహేష్ దీనికి దర్శకుడు. 

More Related Stories