2019లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులు వీళ్లే..tollywood
2019-12-12 03:11:47

ఇండస్ట్రీలో ప్రతీ ఏడాది ఎంతోమంది దర్శకులు వస్తుంటారు. అందులో కొందరు బాగా స్ట్రాంగ్ ముద్ర వేస్తుంటారు. మరికొందరు మంచి సినిమాలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా చాలా మంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో కొందరు మంచి విజయాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరి వాళ్లెవరో.. ఎవరు విజయం అందుకున్నారో చూద్దాం..

1. కేవీ గుహన్.. 118
సినిమాటోగ్రఫర్‌గా స్టార్ డమ్ తెచ్చుకున్న గుహన్.. ఈ ఏడాది మెగాఫోన్ పట్టాడు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 118 సినిమాతో ఈయన దర్శకుడిగా మారాడు. ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. ఆత్మ కాన్సెప్టుకు కాస్త మెడికల్ టచ్ ఇచ్చాడు గుహన్. కళ్యాణ్ రామ్ కు కూడా పటాస్ తర్వాత చెప్పుకోదగిన సినిమా ఇదే.

2. సంజీవ్ రెడ్డి.. ఏబీసీడి
మళయాలంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఏబీసీడి సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. సాఫ్ట్ వేర్ నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ విజయం సాధించాలనుకున్నాడు కానీ ఏబీసీడి మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. అల్లు శిరీష్ ఇందులో హీరోగా నటించాడు.

3. విశ్వక్ సేన్.. ఫలక్ నుమా దాస్
నటిస్తూ దర్శకత్వం చేయడం ఈ మధ్య బాగా తగ్గిపోయింది. అంత రిస్క్ అవసరం లేదని పక్కకు వెళ్లిపోతున్నారు హీరోలు. కానీ చాలా ఏళ్ళ తర్వాత తెలుగులో అలా చేసాడు విశ్వక్ సేన్. మళయాలంలో హిట్ అయిన అన్నామలై డేస్ సినిమాను తెలుగులో ఫలక్ నుమా దాస్ పేరుతో రీమేక్ చేసాడు. ఈ చిత్రం ఓపెనింగ్స్ అదిరిపోయినా కూడా లాంగ్ రన్ మాత్రం కంటిన్యూ కాలేదు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు విశ్వక్.

4, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. స్వరూప్ RSJ
ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అనాథ శవాలపై సాగే ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. సంచలనాత్మక కథతో వచ్చి సంచలన విజయం అందుకున్నాడు స్వరూప్. ఈ సినిమాకు హీరో నవీన్ పొలిశెట్టి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ ఇద్దరూ కలిసి విజయం అందుకున్నారు.

5. డైమండ్ రత్నబాబు.. బుర్రకథ
రెండు బుర్రలతో ఒకే మనిషి. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా.. ఇదే కాన్సెప్ట్ కథగా చేసుకుని డైమండ్ రత్నబాబు చేసిన సినిమా బుర్రకథ. ఆది హీరోగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా తీసిన విధానం మాత్రం చాలా చెత్తగా ఉంది. అందుకే రైటర్ గా సక్సెస్ అయిన డైమండ్.. డైరెక్టర్ గా మాత్రం డిజాస్టర్ అయ్యాడు.

6. కార్తిక్ రాజు.. నినువీడని నీడనినేనే
2019లో వచ్చిన సినిమాల్లో కాస్త కొత్త కాన్సెప్టుతో వచ్చిన సినిమా నినువీడని నీడనినేనే. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని కార్తిక్ రాజ్ తెరకెక్కించాడు. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉంది. యాక్సిడెంట్స్ పై తీసిన ఈ చిత్రం పర్లేదనిపించింది. కార్తిక్ కు మంచి దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది నినువీడని నీడనినేనే.

7. భరత్ కమ్మ.. డియర్ కామ్రేడ్
ఈ ఏడాది సంచలనాలు రేపుతాడేమో అనుకున్న దర్శకుడు భరత్ కమ్మ. డియర్ కామ్రేడ్ సినిమాతో ఈయన మెగాఫోన్ పట్టాడు. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా కూడా ఈయన మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్.. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అయింది. కథ బాగున్నా కూడా కథనం బాగోక డియర్ కామ్రేడ్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.

8. అర్జున్ జంధ్యాల గుణ 369
కార్తికేయ హీరోగా వచ్చిన సినిమా గుణ 369. ఈ చిత్రాన్ని అర్జున్ జంధ్యాల తెరకెక్కించాడు. ఈయన బోయపాటి శ్రీను శిష్యుడు. సినిమాలో ఆ ఆవేశం కూడా కనిపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందనే టాక్ కూడా వచ్చింది. అయితే కథ మరీ రొటీన్ గా ఉండటంతో గుణ 369 అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. ౌ

9. వెంకట్ రాంజీ.. ఎవరు
హిందీలో సంచలన విజయం సాధించిన బద్లా సినిమాను తెలుగులో చాలా వరకు మార్పులు చేసి చేసిన సినిమా ఎవరు. అడవి శేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించాడు. ఈ సినిమాకు అడవి శేష్ కూడా స్క్రీన్ ప్లే సాయం చేసాడు. రెజీనా విలన్ గా నటించిన ఈ చిత్రం దాదాపు 10 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది.

10. తిరు.. చాణక్య
తమిళంలో ఇప్పటికే కొన్నిసినిమాలు చేసి అక్కడ గుర్తింపు తెచ్చుకున్నాడు తిరు. కానీ తెలుగులో మాత్రం తొలిసారి గోపీచంద్ హీరోగా వచ్చిన చాణక్య సినిమాతో దర్శకుడిగా మారాడు. సైరాకు పోటీగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా స్క్రీన్ ప్లే కొంప ముంచేసింది.

11. షమ్మీర్ సుల్తాన్.. మీకు మాత్రమే చెప్తా
విజయ్ దేవరకొండ లాంటి హీరోను నిర్మాతగా మార్చిన కథ మీకు మాత్రమే చెప్తా. ఆ దర్శకుడు షమ్మీస్ సుల్తాన్. ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మూడేళ్ల పాటు ఇక్కడే ఉండి ట్రావెల్ చేసి తరుణ్ భాస్కర్ హీరోగా ఈ చిత్రం చేసాడు షమ్మీర్. విడుదలకు ముందు చాలా హైప్ క్రియేట్ చేసినా రిలీజ్ తర్వాత మాత్రం పెద్దగా సందడి కనిపించలేదు. మీకు మాత్రమే చెప్తా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.

12. అర్జున్ సురవరం.. టిఎన్ సంతోష్
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన సినిమా అర్జున్ సురవరం. ఏడాదిగా విడుదలకు నోచుకోని ఈ చిత్రం ఈ మధ్యే విడుదలైంది. మంచి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి స్పందన కూడా బాగానే ఉంది. తమిళంలో విజయాలు అందుకున్న టిఎన్ సంతోష్ తెలుగులో కూడి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి ఈ ఏడాది ఇలా చాలా మంది కొత్త దర్శకులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

 

More Related Stories