ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నితిన్..Nithiin
2020-06-28 20:51:53

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఒప్పుకుని నటిస్తూ బిజీగా ఉన్నాడు నితిన్‌. మొన్ననే భీష్మ హిట్ కొట్టిన ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ కరోనా కాటు వేయడంతో అది కూడా వాయిదా పడింది. ఇక ఆయన చేస్తున్న తదుపరి సినిమా రంగ్ దే. ఇక ఇది కాక ఛ‌ల్ మోహ‌న రంగ‌ త‌రువాత నితిన్, ద‌ర్శకుడు కృష్ణ చైత‌న్య కాంబినేష‌న్‌లో ప‌వ‌ర్ పేట పేరుతో మ‌రో చిత్రం రాబోతోంది. ఈ సినిమాలోనే కీర్తి సురేష్ హీరోయిన్‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని చెబుతున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’ తరహాలోనే ఈ సినిమా రూపొందనుంద‌ని టాక్. 

దీని మీద అధికారిక ప్రకటన ఏదీ లేకున్నా ఈ సినిమాలో మ‌రో యంగ్ హీరోకి కూడా చోటు దక్కినట్టు ఆ మధ్య ప్రచారం జరిగింది. పవర్ పేట సినిమలో సత్య దేవ్ కు ఓ కీల‌క‌మైన పాత్రలో నటించే అవకాశం దక్కిందట. స‌త్య‌దేవ్ పాత్ర నితిన్‌తో పాటు స‌మానంగా ఉంటుంద‌ని, ఈ క‌థ‌ని మ‌లుపు తిప్పడంలో కీల‌కమవుతుంద‌ని అంటున్నారు.ఇక ఈ సినిమాలో నితిన్‌ మూడు రకాలుగా కనిపించనున్నాడట. 18 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల మధ్య వయస్కుడిగా, ఆ తరువాత 60 వృద్ధుడిగాను కనిపించనున్నారు. ఈ పాత్రల మేకప్‌ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి నిపుణులను తీసుకురానున్నారని కూడా అంటున్నారు. 

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించబోయే పవర్ పేట రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ వేసవిలో ప్రారంభం కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాని ముందు నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో నిర్మించాల‌నుకున్నారు. అయితే ఏమయిందో ఏమో ఆ ప్రాజెక్ట్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ వ‌ద్దకు వెళ్లింది. అక్కడి నుండి ప‌వ‌ర్‌పేట‌ చేతులు మారి పీపుల్ మీడియా వారి ద‌గ్గరికి చేరింది. ఈ కరోనా హడావుడి కొంచెం తగ్గాక ఈ సినిమా షూట్ కి వెళ్ళచ్చని అంటున్నారు.   
 

More Related Stories