ఆ కమెడియన్లను పూర్తిగా మర్చిపోవాల్సిన సమయం వచ్చేసిందా..

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే పక్క ఇండస్ట్రీ వాళ్లకు కుళ్లు ఉండేది. ఇక్కడ ఉన్నంత మంది కమెడియన్లు ఎక్కడా ఉండరు. కనిపించరు కూడా. ఎంతమంది ఉన్నా ఒకే సినిమాలో ఎలాంటి బేషజాలు లేకుండా కలిసి నటిస్తాం అని చెప్పుకునేవాళ్లు మనోళ్లు. కానీ ఇప్పుడు అంత మంది కమెడి యన్లు కనిపించట్లేదు. ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులకు దూరమైపోయారు. ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్నవాళ్లకే విలువ కదా. అందుకే వీళ్ళను మన వాళ్లు మరిచిపోయి చాలా కాలమైంది. ఒకప్పుడు తెలుగులో వెలుగు వెలిగిన బ్రహ్మానందం, కృష్ణ భగవాన్ లాంటి స్టార్ కమెడియన్లు ఇప్పుడు కనిపించడమే మానేసారు. ఇక ఆ మధ్య గుండు హనుమంతరావు, ధర్మవరపు, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, కొండవలస లాంటి స్టార్ కమెడియన్లు కన్నుమూసారు. ఈ మధ్యే గుండు వేణు మాధవ్ కూడా మరణించారు.
బ్రహ్మానందం కూడా ఇప్పుడు పూర్తి ఫామ్ లో లేడు. ఒకప్పుడు ఆయన లేకుండా సినిమాలు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఆయన లేకుండానే అన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆయన ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా కొత్త దరం కమెడియన్లు చాలా మంది రావడంతో బ్రహ్మికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. స్టార్ హీరోలు.. సీనియర్ హీరోలు ఇప్పటికీ బ్రహ్మానందాన్ని కావాలనుకుంటున్నారు కానీ కుర్ర దర్శకులైతే అసలు బ్రహ్మిని పట్టించుకోవడమే మానేసారు. ఆయన లేకుండానే హాయిగా ఉందంటున్నారు వాళ్లు. చిరంజీవి, బాలయ్య లాంటి వాళ్లే ఇప్పటికీ బ్రహ్మితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అవకాశాలిస్తున్నారంతే.
కథలు నచ్చకే తాను సినిమాలకు దూరమయ్యానని చెబుతున్నాడు బ్రహ్మానందం. కానీ ఈయన్ని ఇండస్ట్రీ కూడా దూరం పెట్టి చాలా కాలమైంది. ఓ టైమ్ లో ఏడాదికి 25 సినిమాలు చేసిన బ్రహ్మి.. ఇప్పుడు అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సెటైర్లు వేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న కమెడియన్ కృష్ణ భగవాన్. విలన్ గ్యాంగ్ లో ఉన్నా.. ఈయన వేసే సెటైర్లు మాత్రం మామూలుగా ఉండవు. అరకొరగా తప్పిస్తే.. ఈయన కూడా తెరపై కనిపించడం పూర్తిగా తగ్గించేసాడు. ఇక ఎల్బీ శ్రీరామ్ ను అయితే మనోళ్లు పూర్తిగా మరిచిపోయారు. మొత్తానికి తెలుగు సినిమా నవ్వుకు కష్టకాలం నడుస్తుందిప్పుడు.