జక్కన్న ప్రెజర్..స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న తారక్NTR
2020-04-04 10:50:51

తెలుగులో టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుథిరంను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తూన్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు హిందీ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొన్ననే ఈ సినిమా టైటిల్‌ ను ఖరారు చేస్తూ ఇటీవలే మోషన్‌ పోస్టర్‌ను, చరణ్‌ పుట్టిన రోజున విడుదల చేసింది సినిమా యూనిట్. 

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ టీజర్‌ విడుదల కాగా.. ఒక్క మలయాళం తప్ప అన్ని భాషల్లోనూ ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా ఈ వీడియోలన్నిటికీ ఎన్టీఆర్‌ గొంతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక్కటే వెలితి మలయాళంలో బుడ్డోడు డబ్బింగ్ చెప్పలేకపోయాడు. అయితే మిగతా బాషలలో వచ్చిన రెస్పాన్స్ తో ఈ బాషలో కూడా ఆయన్నే డబ్బింగ్ చెప్పమని జక్కన్న బలవంతం చేశాడట. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఎన్టీఆర్ మలయాళంలోనూ డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. షూట్ పూర్తయ్యే నాటికల్లా ఆ భాషలో పట్టు సంపాదించేందుకు మలయాళంలో ప్రత్యేక శిక్షణకూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కరోనా దెబ్బకు ఈ సినిమా మరింత లేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

More Related Stories