చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ.. బాక్సాఫీస్ దగ్గర వన్స్ మోర్..chiru
2020-03-10 08:02:55

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ల క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుర్ర హీరోలు కూడా వీళ్ళను చూసి కుళ్లుకుంటారు. అంతగా ఫాన్ బేస్ ఉన్న హీరోలు వీళ్లిద్దరు. ముఖ్యంగా వీళ్లకు సరైన సినిమా పడితే ఇప్పటికీ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయగల సత్తా ఉన్న హీరోలు బాలయ్య, చిరంజీవి. అలాంటి ఇద్దరు సీనియర్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి తమ సినిమాలను తీసుకొస్తే అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. ఇప్పటికే మూడేళ్ల కింద 2017 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. పదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150.. బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి పండక్కి వచ్చి మంచి విజయం సాధించాయి. ఇక ఇప్పుడు మరోసారి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది.

దసరాకు సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా ఈమధ్య మొదలైంది. ఈ సినిమాను కూడా దసరాకు తీసుకురావాలని నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. సాధారణంగా అయితే బాలకృష్ణ సినిమాలపై అంచనాలు అంత భారీగా ఉండవు. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా కాబట్టి కచ్చితంగా అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. మరోవైపు చిరంజీవి సినిమాపై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఇద్దరు సీనియర్ హీరోలు దసరా పండుగకు ఒకేసారి తమ సినిమాలను తీసుకువస్తే బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయం. మొన్న సంక్రాంతికి రెండు భారీ సినిమాలు ఒక్క రోజు తేడాతో వచ్చి సంచలన విజయం సాధించాయి. అలాగే దసరా సెలవుల్లో కూడా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల కుంభవృష్టి కురవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

More Related Stories