సైరా వేడుకలో పెద్ద ఎన్టీఆర్ ప్రస్తావనntr
2019-09-23 06:43:12

నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరిగిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేదిక మీద ప్రసంగించిన పవన్ అన్నయ్య చిరంజీవి మీద ప్రశంసల వర్షం కురిపించారు. కొత్తహీరోలు ఎంత మంది వచ్చినా చిరంజీవి లాంటి హీరో అనుభవం ముందు వాళ్లంతా నిలవలేరని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రస్తావన తీసుకు రావడంతో పవన్ మీద ప్రసంశల వర్షం కురుస్తోంది. అనుభవానికి తను పెద్దపీట వేస్తానని పవన్ చెప్పుకొచ్చాడు.

చిరు 'ఖైదీ' సినిమా విడుదలైన తరవాత చిరంజీవికి స్టార్ డమ్ స్టార్ట్ అయినప్పుడు ఒక తమ్ముడిగా మా అన్నయ్య చాలా పెద్ద హీరో అని అనుకున్నానని, కానీ అదే సమయంలో రిలీజయిన ఎన్టీ రామారావు గారి 'విశ్వామిత్ర' సినిమా ఖైదీ రికార్డులను బద్దలుకొట్టేసిందని, ఆ రోజు ఒక వ్యక్తి తాలూకా అనుభవాన్ని ఎప్పుడూ తీసేయలేమని తనకు అర్ధం అయ్యిందని పవన్ చెప్పుకొచ్చారు. అలాగే ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా, ఎంత మంది పాత రికార్డులు బద్దలుకొట్టినా చిరంజీవి గారి అనుభవాన్ని కొట్టేయలేమని పవన్ చెప్పుకొచ్చారు. తాను నటుడిగా మారకముందు 'శుభలేఖ' సినిమాలో ఒక డబ్బింగ్ డైలాగ్ చెప్పానని, మళ్లీ తన గళం ఇచ్చింది 'సైరా నరసింహారెడ్డి'కి అని పవన్ ఈ సందర్భంగా చెప్పారు.

సినిమా క్లైమాక్స్‌ డబ్బింగ్ శనివారమే తాను చెప్పానని. జనగణమన గొప్పతనాన్ని చెప్పే విధంగా ఆ డైలాగులు ఉన్నాయని అన్నారు. ఇది తన దేశం కోసం, ప్రజల కోసం తీసిన సినిమా అని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా స్థాయిని ఇండియాతోనే కాక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమని పవన్ చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా తమకు అసూయ కలగదని, ఇంకా ఆనందపడతామని, ఇదే అన్నయ్య తమకు నేర్పించిన సంస్కారమని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

 

More Related Stories