చరిత్ర తిరగ రాస్తున్న మెగా హీరోలు.. అందరూ ఒకే దారిలో..Pawan Kalyan
2020-02-11 23:33:08

ఇక్కడ చరిత్ర తిరగ రాయడం అంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం కాదు. నిజంగానే చరిత్ర పేజీలని మళ్లీ తిరగరాస్తున్నారు మెగా హీరోలు. ఒకేసారి అందరూ స్వాతంత్ర సమరయోధుల పాత్రలో నటిస్తుండడం నిజంగానే యాదృచ్చికం. గతేడాది చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా నరసింహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. 

ఇక ఇప్పుడు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో సీతారామరాజుగా కనిపిస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ లుక్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చింది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా స్వతంత్ర సమరయోధుడు పాత్రలో నటిస్తున్నాడు. పాలమూరు పండుగ సాయన్న పాత్రలో పవన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రతికిన 18వ శతాబ్దపు ప్రాంతంలోనే సాయన్న కూడా ఉన్నాడు. 

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ ప్రాంతంలో పండుగ సాయన్న నివసించాడు. అప్పట్లో నిజాం ప్రభువులకు ఎదురునిలిచి పోరాడాడు. వాళ్లతో పాటు బ్రిటిష్ సైన్యానికి కూడా చెమటలు పట్టించిన రాబిన్ హుడ్ పండుగ సాయన్న. పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టే పాత్ర ఇది. పాలమూరు జిల్లాలో పండుగ సాయన్న గురించి కథలు కథలుగా చెబుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు క్రిష్ ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కోసమే పవన్ కళ్యాణ్ లుక్ కూడా మార్చేశాడు. కోరమీసాలతో ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఇప్పుడు అభిమానులను అలరిస్తుంది. 

భారీ బడ్జెట్తో నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇందులో పవన్ కళ్యాణ్ పోషించేది పాలమూరు పండుగ సాయన్న పాత్ర అని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. కానీ పవన్ కనిపిస్తున్న తీరు.. చేతిపై ఉన్న గద్ద టాటూ చూస్తుంటే పవర్ స్టార్ పోషిస్తున్న పాత్ర పండుగ సాయన్న అని అర్థమైపోతుంది. మొత్తానికి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఒకేసారి చరిత్రలో ఉన్న వీరుల పాత్రలు పోషించడం అభినందనీయం. 

More Related Stories