స్క్రిప్టు లేకుండా షూటింగ్ చేశాడు.. శ్రీకాంత్ అడ్డాలపై PVP సంచలన వ్యాఖ్యలు..PVP Srikanth Addala
2019-08-31 17:00:30

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొత్త బంగారు లోకంతో పరిచయమై సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సంచలన విజయం అందుకొన్నాడు ఈయన. ఆ తర్వాత వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసిన ముకుంద సినిమా అంచనాలు అందుకోలేదు. ఆ వెంటనే మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాతో డిజాస్టర్ ఇచ్చి మళ్లీ ఇప్పటివరకు మరో సినిమా చేయలేకపోయాడు శ్రీకాంత్ అడ్డాల. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి నిర్మాత PVP సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మోత్సవం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. ఈ చిత్ర షూటింగ్ కు ముందు కనీసం శ్రీకాంత్ అడ్డాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయలేదని.. తనకు స్క్రిప్ట్ కూడా చూపించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇదే విషయంపై ఆయన ఈ మెయిల్ చేసినా కూడా ఇప్పటి వరకు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పాడు పివిపి. ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఎంతో మంది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల కష్టం.. ఖర్చు మన దగ్గర ఉంటుందని.. ఆ నమ్మకంతో మనం ఆడుకోకూడదు అంటూ ఆయనకు ఈ మెయిల్ చేసినట్లు చెప్పారు పివిపి. అయినా కూడా దర్శకుడు కనీసం రిప్లై ఇవ్వకపోవడం బాధేసింది అంటున్నాడు ఈ నిర్మాత. బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నప్పుడే అది సరిగ్గా రావడం లేదనే విషయం తనకు అర్థమైందని.. అయితే ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ ఉన్నప్పుడు నిర్మాత చేసేది ఏమీ లేదు ఒక క్యాషియర్ గా మారిపోవడం తప్ప అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు PVP. 

మన తెలుగు ఇండస్ట్రీలో దర్శకుల తీరు మారాలని.. వాళ్లు మారినప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటున్నాడు పివిపి. ఈ రోజుల్లో నిర్మాతకు ఏ దర్శకుడు కూడా విలువ ఇవ్వడం లేదని.. తెలుగులో కొందరు అగ్ర దర్శకులు అయితే నిర్మాత సెట్ కు రాకూడదనే కండిషన్ తో సినిమా చేస్తారు అంటున్నాడు. అలాంటి దర్శకులు మన దగ్గర ఉన్నారని.. నిర్మాతలను కనీసం పట్టించుకోని దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఇక్కడ నిర్మాతలకు మంచి రోజులు రావు అంటున్నాడు పివిపి. హాలీవుడ్ లో ఒక సినిమాపై హక్కు మొత్తం స్టూడియోలకు ఉంటుందని.. అక్కడ దర్శకుడు సినిమా చేయడంతో అతని పని అయిపోతుందని.. చివరికి ఎడిటింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు అన్ని నిర్మాతలు చూసుకుంటారు.. కానీ తెలుగులో అలా కాదు నిర్మాతకు రెండు రోజుల ముందు సినిమా పూర్తి చేసి దర్శకుడు చూపిస్తున్నాడని.. అప్పుడు తాము ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో పడిపోతున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈ నిర్మాత. బ్రహ్మోత్సవం సినిమాతో తాను చాలా పెద్ద గుణపాఠం నేర్చుకున్నానని.. స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి అంటున్నాడు ఈయన. మొత్తానికి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కెరీర్ పై మరింత ప్రభావం చూపించడం ఖాయం. మరి దీనిపై ఆయన ఏదైనా స్పందిస్తాడో లేదా అనేది చూడాలి.

More Related Stories