కొరటాల శివ యూనిట్‌పై సీరియస్ అయిన రామ్ చరణ్..

ఈ రోజుల్లో సినిమా చేయడం కాదు.. తీసిన సినిమాను కాపాడుకోవడం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారం అవుతుంది. పాపం వాళ్ళు ఏళ్ల పాటు కష్టపడి చేసిన సినిమాను విడుదలకు ముందే లీక్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఆ మధ్య గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలకు ఇదే ఇబ్బంది వచ్చింది. మొన్నటికి మొన్న రాజమౌళి సినిమా సీన్స్ కూడా లీక్ చేసారు. ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాను టార్గెట్ చేశారు లీకు రాయుళ్లు. ఈ సినిమాలో ఓ సీన్ లీక్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. అక్కడ చిరంజీవిపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కొరటాల. అందులో చిరు లుక్ కూడా అదిరిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. దీనిపై నిర్మాత రామ్ చరణ్ కూడా చిత్ర యూనిట్ పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాడు దర్శకుడు కొరటాల. అక్కడే మరో నెల రోజులకు పైగా షూటింగ్ జరగనుంది.
ఇదే ఏడాది సినిమా కూడా విడుదల కానుంది. వరసగా ఈ సినిమాలోని పోస్టర్లు.. స్టిల్స్.. వీడియోలు కూడా లీక్ అవుతూనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు దర్శక నిర్మాతలను కూడా భయపెడుతుంది. అయితే లీకులతో తమ సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని నిర్మాతలు చెబుతున్నారు. తమ సినిమాలో దమ్ము ఉందని ఇలా లీక్ చేయడం వల్ల తమ సినిమా వీక్ కాదని చెబుతున్నారు వాళ్ళు. దసరా కానుకగా చిరు సినిమా విడుదల కానుంది. నక్సలిజంతో పాటు దేవాదాయ శాఖ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. అయినా ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో లీకులు బాగా ఎక్కువైపోతున్నాయి. కొందరు సినిమాకు పని చేసిన వాళ్లే అత్యుత్సాహంతో లింకులు బయటకి వదిలేస్తున్నారు. చిరంజీవి సినిమా విషయంలో అలాంటిది ఏమైనా జరిగిందా అని ఆరా తీస్తున్నారు దర్శక నిర్మాతలు. ఏదైనా ఆదిలో తుంచేయడమే సరైంది. లేదంటే జరిగే నష్టం దారుణంగా ఉంటుంది.