రామ్ తర్వాతి సినిమా అదే...దసరాకి మొదలు Ram Pothineni
2019-10-03 11:23:17

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మొన్ననే ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు. ఆ జోష్ తో కొన్నాళ్ళ పాటు వెకేషన్ కి కూడా వెళ్లోచ్చిన ఈ కుర్ర హీరో ఇప్పుడు తన తర్వాతి సినిమా మీద ద్రుష్టి పెడుతున్నాడు. ఆయన త‌న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే ప‌నిచేయ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలలో గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది నిజమే అని అంటున్నారు.  ‘నేను.. శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు చేసిన కిషోర్ తిరుమలతో ముచ్చటగా మూడో సినిమాకి రామ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూడో సినిమాకు ఓ వెరైటీ కథ అనుకున్నారట. తమిళ చిత్రం ‘తడమ్‌’కి ఇది రీమేక్‌ అట. అరుణ్ విజ‌య్ హీరోగా న‌టించిన తడమ్‌ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. 

తడమ్ మూవీ మార్చి 1న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఈ సినిమా ఒకటి. సినిమా విడుదలైన రెండో రోజు నుంచే దీని రీమేక్ కోసం టాలీవుడ్ నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. గట్టి పోటీ నెలకొనగా స్రవంతి రవికిషోర్, ఠాగూర్ మధు కలిసి హక్కులు కొన్నారు. రామ్ కెరీర్ మొత్తమ్మీద ఇప్పటివరకు ఒకే ఒక రీమేక్ సినిమాలో నటించాడు. అదే మసాలా సినిమా, ఆ సినిమా కొట్టిన దెబ్బకి మళ్ళీ ఆ తరువాత మళ్ళీ రీమేక్‌ల జోలికి వెళ్ళని రామ్ మరి తడమ్‌తో ఆరేళ్ళ తరువాత మరో ప్రయత్నం చేస్తాడో లేదో చూడాలి. ఈ సినిమా నవంబర్‌ నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ కి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు దసరాకి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

More Related Stories