కేజీఎఫ్2లో తెలుగు విలక్షణ నటుడు Rao Ramesh
2020-02-11 15:52:54

ఎవరు ఊహించని విధంగా.. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది కే.జీ.ఎఫ్ మూవీ. అంతకు ముందు కేవలం కన్నడ ప్రేక్షకులకే తెలిసిన హీరో యశ్.. కే.జీ.ఎఫ్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో ఈ సినిమా సీక్వేల్‌గా కే.జీ.ఎఫ్‌. చాప్టర్‌-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ చూసిన ఆడియెన్స్ సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా నటీనటుల విషయంలో చాలా కేర్ ఫుల్ తీసుకుంటున్నాడు ప్రశాంత్. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్.. సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్ నుంచి రావు రమేశ్ అవకాశం అందుకున్నాడు. తెలుగులో విలక్షణ నటుడిగా పేరొందిన రావు రమేష్.. కే.జీ.ఎఫ్‌-2లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

ఆయన షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు తనతో దిగిన ఒక పిక్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ లో పెట్టాడు. 'రావు రమేష్‌ గారికి స్వాగతం.. ఇందులో మీ పాత్ర గురించి ఊహాగానాలు ప్రేక్షకులకే వదిలేస్తున్నా. కే.జీ.ఎఫ్‌-2లో మీరు భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఈ చిత్రంలో రావు రమేష్ రోల్ ఎలా ఉండబోతుందోనని.. ఇప్పటి నుంచే ఆసక్తికర చర్చ మొదలైంది. మరి రావుగారు ఇందులో ఎలా మెప్పిస్తారో చూడాలి.

More Related Stories