ఆర్డీఎక్స్ లవ్ రివ్యూRDX Love
2019-10-11 15:49:17

ఆర్ ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్  తన రెండో సినిమాగా ఆర్డిఎక్స్ లవ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ గా కనిపిస్తూనే మంచి సబ్జెక్ట్ ఉన్నట్టు పబ్లిసిటీ చేశారు మేకర్స్. ఇక ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యింది. బోల్డ్ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఒక గ్రామలో నలుగురు స్నేహితురాళ్ళతో కలిసి ప్రభుత్వ పథకాలకు అలివేలు (పాయల్ రాజ్‌పుత్‌) ప్రచారం చేస్తుంటుంది. ఎయిడ్స్, గుట్కా, మద్యపానం, ధూమపానం వంటి వాటిపై ప్రచారం చేస్తూ.. వాటి నివారణ కోసం పాటు పడుతుంటుంది.  ఈ క్రమంలోనే ఆమెను అనేక సమస్యలు చుట్టుముడతాయి. అయినప్పటికీ పాయల్ వెనకడుగు వేయదు. ఏం జరిగినా సరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటుంది. తోటి వారితో తాను చేస్తున్న పోరాటం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఎలాగైనా ముఖ్యమంత్రిని కలిసి తన సొంతగ్రామమమైన చంద్రన్నపేటలో జరుగుతున్న విషయాలను గురించి వివరించి అక్కడ మార్పు తీసుకురావాలని అనుకుంటుంది. ఇదే సమయంలో  సిద్ధు (తేజస్ కంచర్ల) ఆమెకు పరిచయం అవుతాడు.. ప్రేమించానని వెంటబడతాడు. తేజస్ ను వాడుకుని సీఎంతో అపాయింట్మెంట్ సంపాదిస్తుంది. ఆ సమయంలో ఆమె అనుకోని ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందులు ఏంటి? ఎవరు ఇబ్బందులు కలిగించారు ? వాటిని ఆమె ఎలా ఎదిరించింది అనేది కథ.

విశ్లేషణ:

ఒక్కో గ్రామంలో ఒక్కో సమస్య ఉంటుంది. పరిష్కారం కాకూండా మిగిలిపోయిన సమస్యలు అనేకం ఉన్నాయి.  కొన్ని సమస్యలను కావాలని పరిష్కరించకుండా పక్కన పెడతారు అక్కడి నాయకులు. ఎందుకంటే ఆ సమస్యలు పరిష్కరిస్తే తరువాత గ్రామానికి నాయకుల అవసరం ఉండదు కదా. ఇది అందరికీ బహిరంగ రహస్యమే. అయితే ఓ గ్రామానికి చెందిన అమ్మాయి..ధైర్యం చేసి బయటకు వచ్చి ఎయిడ్స్ పై పోరాటం చేసేందుకు ముందుకు వస్తుంది.  దానిపై అవగాహన కల్పించేందుకు రెడీ అవుతుంది.  ప్రతి ఇంటికి వెళ్లి ఆ సమస్య గురించి చెప్తూ దానికి సొల్యూషన్ కూడా చూపిస్తూ ఉంటుంది పాయల్ రాజ్ పుత్. అయితే ఇక్కడ సంగతి చూస్తే ఇంటింటికి వెళ్లి ఏదో సబ్బు గురించి చెప్పినట్టు కండోమ్స్ గురించి చెప్పడం వాటిని వారికీ ఇవ్వడం అన్నది నేటి పరిస్తుతిలకి నమ్మేట్టుగా లేదు.  ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే సాగిపోతుంది. ఓపెనింగ్ షాట్స్ లోనే దాదాపుగా క‌థ చెప్పేశాడు ద‌ర్శకుడు. డ్రామా, ఎమోష‌న్స్‌పై దృష్టిపెట్టాల్సిన ద‌ర్శకుడు ఆ దిశ‌గా చేసిన ప్రయ‌త్నాలు ఫ‌లితాన్నివ్వలేదు. తీసుకున్న సబ్జెక్ట్ ఏమో సమస్యల మీద పోరాటం కానీ సినిమా మాత్రం పాయల్ ను ఆమె బోల్డ్ నెస్ ని ఎలా వాడుకుందాం అని చేసిన ప్రయత్నమే కనిపిస్తుంది. సినిమా టైటిల్ కూడా అదే ఉద్దేశ్యంతో పెట్టరేమో అనిపించింది. అర్ధనారి వంటి అర్థవంతమైన సినిమా తీసిన దర్శకుడి నుండి ఇటువంటి సినిమా ఎవరూ ఎస్క్పెక్ట్ చేయరు. దర్శకుడి ఉద్దేశం మంచిదే అయ్యుండచ్చు కానీ పథకాల ప్రచారం పేరుతో తీసిన సన్నివేశాలు అన్నీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిని కలవడం కోసం ఆడపిల్ల అటువంటి పథకాలకు ప్రచారం చేయాలా? మరో మార్గం లేదా? అని ప్రేక్షకులకే అనిపిస్తుంది.

నటీనటుల పనితీరు:

ఈ సినిమా మొత్తం పాయల్ రాజ్ పుత్ చుట్టూనే అల్లారు. ఆమెను రొమాంటిక్ సీన్స్ కోసమే తీసుకున్నట్టు అనిపిస్తుంది, ఆయా సీన్స్ లో ఆమె జీవించింది. ఇక మిగతా సీన్స్ ల్లో కూడా పర్వాలేదనిపించుకుంది.  ఇక హీరో పాత్ర కేవలం హీరోయిన్ చుట్టూ తిరగడంతోనే సరిపెట్టారు. విలన్ గా ఆదిత్య మీనన్ ఇంప్రెస్ చేస్తాడు. మిగతా నటీనటుల పాత్రలు కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయి.  

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు శంకర్ భాను పాయల్ అందాల చుట్టూనే ఫోకస్ చేశాడు. ఎందుకున్న పాయింట్ బాగున్నా దానిని ఎలివేట్ చేసే విధానమే బెడిసికొట్టింది. సినిమా కాన్సెప్ట్ రవితేజ 'భగీరథ' సినిమా కాన్సెప్ట్ గుర్తు చేయక మానదు. కొన్ని సన్నివేశాల్లో డైలాగులు బాగున్నాయి. రధన్ పాటల సంగతి పక్కన పెడితే నేపథ్య సంగీతం ఎబ్బెట్టుగా అనిపించింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరిగా : ఆర్డీఎక్స్ లా పేలుతుందనుకున్న ఆర్డీఎక్స్ లవ్ తుస్ మనిపించింది

రేటింగ్: 1/5
 

More Related Stories