సాహో సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు..Saaho
2019-08-23 16:50:39

బాహుబలి తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది. వారం రోజుల ముందే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్న యాక్షన్ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేశాయని చెప్పారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. దర్శక నిర్మాతలు కూడా కథ పై ఉన్న నమ్మకంతో బడ్జెట్ లెక్కలు అసలు చూసుకోలేదు. బాహుబలితో బౌండరీస్ చెరిపేసిన ప్రభాస్ సాహోతో మరింత ముందుకు వెళ్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. 171 నిమిషాల నిడివితో సాహో వస్తుంది. 2 గంటల 52 నిమిషాలు అంటే కాస్త ఎక్కువే అయినా కూడా సినిమాలో కంటెంట్ బలంగా ఉందని చెబుతున్నాడు దర్శకుడు సుజీత్. దాదాపు మూడు గంటలున్నా కూడా ఎక్కడా బోర్ కొట్టదని ఆయన హామీ ఇస్తున్నాడు. కచ్చితంగా ఇండియన్ సినిమాల్లో సరికొత్త యాక్షన్ ఎంటర్ టైనర్ ను సాహో రూపంలో చూస్తారు అంటూ అభిమానులకు అభయం ఇస్తున్నాడు సుజీత్. 300 కోట్లతో యు.వి.క్రియేషన్స్ సాహో సినిమా నిర్మించింది. ప్రభాస్ కూడా ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. నెల రోజుల నుంచి మరో పని ఏదీ పెట్టుకోకుండా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నాడు. ఒకవైపు బాలీవుడ్ కవర్ చేస్తూనే మరోవైపు తమిళ మలయాళ ఇండస్ట్రీలని కూడా చుట్టేస్తున్నాడు ప్రభాస్. ఓపెనింగ్స్ విషయంలో కూడా సాహో సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి వాళ్ళ ఆశలను ఈ చిత్రం ఎంతవరకు నిలబెడుతుంది అనేది చూడాలి.

More Related Stories