బాలీవుడ్ కి వెళ్ళిన డైరెక్టర్ తో తేజూ సినిమా ? Sai Dharam Tej
2019-08-16 08:43:50

వరుసగా చాలా సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాక చిత్రలహరి సినిమాతో నిలదొక్కుకున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. ఆ ఊపులోనే వరుస సినిమాలు ఒప్పుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తేజూ మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజూ పండగే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాక దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న సినిమాలో తేజ్ నటించనున్నాడట. తాజాగా సుబ్బు అనే కొత్త దర్శకుడు చెప్పిన కధకి కూడా తేజూ ఓకే చెప్పేశాడట. ఈ రెండు సినిమాలు కాకుండా ఆయన మరో సినిమా కూడా ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఎవరితో అంటే ప్రస్థానం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన దేవా కట్టాతో అని తెలుస్తోంది. శర్వా-సాయి కుమార్ లతో ప్రస్థానం సినిమా తెరకెక్కించిన దేవా ఆ తర్వాత ఆటోనగర్ సూర్య అనే సినిమా చేశాడు కాని అది పెద్దగా ఆడ లేదు. 

ఇక తెలుగులో సినిమా చేయని దేవా కట్టా హిందిలో ప్రస్థానం రీమేక్ చేశాడు. సంజయ్ దత్ హీరోగా చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈమధ్య రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. నెట్ ఫ్లిక్స్ కోసం బాహుబలి వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన దేవా కట్టా, బాలీవుడ్ ప్రస్థానం రిలీజ్ అయ్యాక మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలని చూస్తున్నాడని, అందులో భాగంగానే తేజూకి మంచి కధ చెప్పాడని, ఆ కధ కూడా తేజూకి బాగా నచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమాను భగవాన్, పుల్లారావులు నిర్మిస్తారని కూడా ప్రచారం మొదలయ్యింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories