బాలయ్య కోసం పెన్ పట్టిన గౌతమీపుత్ర శాతకర్ణి రైటర్.. balakrishna
2020-04-16 02:04:56

బాలకృష్ణకు ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు ఇవ్వాలి అంటే బోయపాటి శ్రీను బెస్ట్ ఆప్షన్. ఇప్పటికే ఈ కాంబినేషన్లో మూడో సినిమా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. 1990ల నుంచి బాలయ్యకు సరిగ్గా సరిపోయిన దర్శకుడు ఒకరున్నారు. ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చింది అంటే ఇండస్ట్రీ రికార్డులు మారిపోవాల్సిందే. అంతగా బాలయ్యను అర్థం చేసుకున్న దర్శకుడు బి.గోపాల్. 

ఈ కాంబినేషన్ లో వచ్చిన ఐదు సినిమాల్లో 4 చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు ఆరోసారి ఇద్దరు జోడి కట్టబోతున్నారు. పదేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న బి.గోపాల్ త్వరలోనే బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు. మొత్తంగా నరసింహనాయుడు కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. అన్నీ కుదిరితే బోయపాటి సినిమాతో పాటే దీన్ని కూడా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు బాలకృష్ణ. 

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడు సాయి మాధవ్ బుర్రా. గతంలో బాలయ్య 100వ సినిమా శాతకర్ణికి పని చేసాడు ఈయన. దాంతో పాటే ఎన్టీఆర్ రెండు భాగాలకు కూడా మాటలు రాసాడు బుర్రా. ఇప్పుడు బాలయ్య కోసం అదిరిపోయే మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఇండస్ట్రీ రికార్డులతో ఆడుకున్నాయి. 

అయితే ఐదో ప్రయత్నంగా వచ్చిన పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత 2007లో హరహర మహాదేవ అనే సినిమాకి ముహూర్తం పెట్టిన అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత పూర్తిగా దర్శకత్వానికి దూరమైయిపోయాడు బి.గోపాల్. గోపీచంద్ హీరోగా వచ్చిన ఆరడుగుల బుల్లెట్ సినిమాను తెరకెక్కించిన కూడా అది విడుదల కాలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత బాలకృష్ణ సినిమాతో మెగాఫోన్ పడుతున్నాడు సీనియర్ దర్శకుడు. మరి ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories