సరిలేరు నీకెవ్వరు టీజర్.. సంక్రాంతికి మొగుడు వస్తున్నాడు..sarileru
2019-11-23 01:54:32

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? ఇప్పుడు టీజర్ విడుదల చేసి వాటిని మరింత పెంచేసాడు దర్శకుడు అనిల్. ముఖ్యంగా మహేష్ బాబుతో పంచ్ డైలాగులు చెప్పించాడు ఈ కుర్ర దర్శకుడు. వేరియేషన్స్ లేకపోయినా కూడా మరోసారి పక్కా ఫార్ములా సినిమాతోనే వస్తున్నాడు ఈయన. సాధారణంగా అనిల్ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం యాక్షన్ ఫార్ములాతో వస్తున్నాడు ఈ దర్శకుడు. తొలిసారి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తగలడంతో పక్కాగా ఆయన ఇమేజ్‌కు తగ్గట్లుగా కథ రాసుకున్నాడు అనిల్ రావిపూడి. టీజర్‌లో కొత్తదనం లేకపోయినా కూడా హిట్ ఫార్ములా మాత్రం కనిపిస్తుంది. మిలటరీలో పని చేసే మహేష్ బాబు..

సమాజంలో జరిగే అక్రమాలను చూసి ఎలా రియాక్ట్ అయ్యాడన్నది సరిలేరు నీకెవ్వరు కథగా కనిపిస్తుంది. టీజర్‌లోనే చిన్నసైజ్ కథ చెప్పేసాడు దర్శకుడు. విజయశాంతి పాత్రను కూడా పరిచయం చేసాడు. భయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవు అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆయన కారెక్టరైజేషన్ గురించి చెబుతుంది. ఇక గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడని విజయశాంతితో డైలాగ్ చెప్పించాడు అనిల్. మొత్తానికి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పొందుపరిచాడు అనిల్ రావిపూడి. ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వస్తున్నాడంటూ ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలైట్. మొత్తానికి జనవరి 11న సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చేస్తున్నాడు.

 

More Related Stories