హీరోలకు వయసు ఎక్కువ.. కరోనా వైరస్ కు కరుణ తక్కువ.. corona lockdown
2020-06-06 00:45:56

ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇలాగే అనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు చాలా ఇండస్ట్రీలో హీరోలకు వయసు కాస్త ఎక్కువగానే ఉంది. 60 ఏళ్లు పైబడిన వాళ్ళు బయటికి రాకూడదు అంటూ ప్రభుత్వమే చెప్పింది. వాళ్లకు కరోనా వైరస్ సోకితే చాలా త్వరగా అనారోగ్యం పాలు కావడమే కాకుండా పరిస్థితి విషమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ విషయానికొస్తే అంత త్వరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. దానికి కారణం మన హీరోల వయసు. ఉదాహరణకు తెలుగు ఇండస్ట్రీని తీసుకుంటే ఇక్కడ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరూ 60 ఏళ్ల  పైబడిన వాళ్లే.

పైకి చెప్పుకోవడానికి కాస్త నామోషీగా అనిపించినా వయసును మాత్రం దాచుకోలేరు కదా. మరోవైపు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా 50కు అటు ఇటుగా ఉన్నారు. ఈ పక్కన ఉన్న తమిళం ఇండస్ట్రీలో చూస్తే రజనీకాంత్, కమల్ హాసన్ వయస్సు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో కూడా చాలామంది హీరోలకు వయసు 50 ఏళ్లు పైనే ఉంది. వాళ్లు ఎంత ఎక్సర్సైజులు చేసినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటున కరోనా వైరస్ సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యమైనా పర్లేదు అనుకుంటున్నారు మన హీరోలు. ఏదేమైనా కరోనా కట్టడిలోకి వచ్చిన తర్వాతే తాము కెమెరా ముందుకు వస్తాం అని చెప్తున్నారు మన సూపర్ స్టార్ లు. అది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వయసు కూడా 60 దాటిపోయింది. ఇలాంటి సమయంలో షూటింగులు చేసి రిస్క్ తీసుకునే కంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవడమే నయం. 

More Related Stories