శివ‌లింగా రివ్యూ రేటింగ్Sivalinga-Movie-Review-Rating
2017-04-14 08:32:24

దెయ్యాలా సినిమా అంటే కేరాఫ్ అడ్ర‌స్ లారెన్స్ అయిపోయాడు ఇప్పుడు. ముని సిరీస్ తో ఈయ‌న దెయ్యాల్ని ద‌త్త‌త తీసుకున్నాడు. తాజాగా మ‌రో హార్ర‌ర్ సినిమాతో వ‌చ్చాడు లారెన్స్. అదే శివ‌లింగా. మ‌రి ఇది లారెన్స్ ఆశ‌ల్ని తీర్చిందా..? ఎలా ఉంది..?

క‌థ ‌: ట్రైన్ లో ర‌హీమ్(శ‌క్తి) అనే వ్య‌క్తి చ‌నిపోతాడు. అత‌డికి సుసైడ్ అని చెబుతారు. కానీ అది సుసైడ్ కాద‌ని.. మ‌ర్డ‌ర్ అని అత‌డి భార్య కేస్ ఫైల్ చేస్తుంది. అదే టైమ్ లో ఆ కేస్ ను డీల్ చేయ‌డానికి సిఐడి ఆఫీస‌ర్ శివ‌లింగేశ్వ‌ర‌న్(లారెన్స్) వ‌స్తాడు. అత‌డితో పాటు థ్రిల్స్ ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే అత‌డి భార్య స‌త్య‌ (రితికా సింగ్) కూడా వ‌స్తుంది. ఆ కేస్ ను స్ట‌డీ చేస్తుండ‌గానే శివ‌లింగా, స‌త్య జీవితాల్లో కొత్త కొత్త మార్పులు జ‌రుగుతుంటాయి. స‌డ‌న్ గా ఓరోజు స‌త్య వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెడుతుంది. అస‌లు స‌త్య‌కు ఏమైంది..? శివ‌లింగా ఆ కేసును ఛేదించాడా లేదా..? అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం : హార్ర‌ర్ థ్రిల్ల‌ర్స్ కు కావాల్సింది ప‌క్కా స్క్రీన్ ప్లే. త‌ర్వాతి సీన్ ఏం జ‌రుగుతుందో తెలియ‌నంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. అప్పుడే హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ ఆక‌ట్టుకుంటాయి. ఈ విష‌యంలో పి వాసు శివ‌లింగాకు త‌న వంతు సాయం బాగానే చేసాడు. సినిమా ట్రైన్ లో మ‌ర్డ‌ర్ సీన్ తో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఆస‌క్తిక‌రంగానే ముందుకు సాగుతుంది. చంద్ర‌ముఖి త‌ర‌హాలోనే క్లైమాక్స్ వ‌ర‌కు కూడా క‌థ‌ను చాలా గ్రిప్పింగ్ గా ముందుకు తీసుకెళ్లారు ద‌ర్శ‌కుడు. కామెడీ విష‌యంలోనూ వాసు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అయితే అరవ కామెడీ సినిమా సీరియ‌స్ గా సాగుతున్న టైమ్ లో మైండ్ డిస్ట‌ర్బ్ చేసేలా ఉంది. ఓవ‌రాల్ గా శివలింగా క‌థ‌నం బాగానే ఉంది.

న‌టీన‌టులు : లారెన్స్ శివ‌లింగగా అద‌ర‌గొట్టాడు. ఈ సినిమాకు ఏరికోరి మ‌రీ వాసు.. లారెన్స్ నే ఎందుకు తీసుకున్నాడో సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. లారెన్స్ లోని న‌టుడు మెల్ల‌గా ఒక్కో సినిమాతో బ‌య‌టికి వ‌స్తున్నాడు. ఈ సినిమాలో కూడా అలాగే చేసాడు. అయితే అక్క‌డ‌క్క‌డా మ‌రీ లౌడ్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చాడు. ఇక గురుతో అద‌ర‌గొట్టిన రితికా సింగ్.. ఈ సినిమాలోనూ ర‌ప్ఫాడించింది. లారెన్స్ చెప్పిన‌ట్టు ఈ సినిమాకు హీరో రితికా సింగే. ముఖ్యంగా ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ లో అద‌రగొట్టేసింది. వ‌డివేలు కూడా ఉన్నంత‌లో బాగానే న‌వ్వించాడు. మిగిలిన వాళ్లు ఓకే. 

టెక్నిక‌ల్ టీం : ద‌ర్శ‌కుడిగా వాసు గురించి ఏం చెప్ప‌డానికి లేదు. ఆయ‌న సింపుల్ క‌థ‌కు చాలా చ‌క్క‌టి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. డైలాగుల విష‌యంలోనూ జాగ్ర‌త్త తీసుకున్నాడు. కెమెరా వ‌ర్క్ ఓకే. ఇక సంగీతం విష‌యానికొస్తే థ‌మ‌న్ మంచి మార్కులు కొట్టేసాడు. చాలా రోజుల త‌ర్వాత మ‌న‌సుపెట్టి సంగీతం అందించిన‌ట్లు అనిపించింది. ముఖ్యంగా రంగుర‌కర సాంగ్ మాస్ కు బాగా ఎక్కుతుంది. 
న‌టీన‌టులు : లారెన్స్, రితికాసింగ్, వ‌డివేలు తదిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పి వాసు

చివ‌ర‌గా : శివ‌లింగా క‌న్నడ సినిమాకు రీమేక్. అది చూస్తే ఈ సినిమా చూడ‌టం క‌ష్టం.. కానీ అది చూడ‌క‌పోతే మాత్రం శివ‌లింగా అల‌రించ‌డం ఖాయం.

Rating : 3/5

More Related Stories