బ్యాగ్రౌండ్ లేకపోతే బతకనివ్వరా.. ఎందుకు అంత నెపోటిజమ్..Sushant Singh Rajput
2020-06-17 00:48:23

సినిమా ఇండస్ట్రీ అనేది ఎవడబ్బ సొత్తు కాదు. అది ఒక్కడి చేతుల్లో ఉండదు. ఎన్నో వేలమంది కలిస్తే ఒక సినిమా ఇండస్ట్రీ అవుతుంది. అలాంటి ఇండస్ట్రీని కొందరు చేతుల్లోకి తీసుకుని తమకు ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటున్నారని విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే అలాంటి వారసత్వ ధోరణి ఉందని.. మిగిలిన ఇండస్ట్రీలో లేదు అని చాలా మంది అనుకున్నారు. కానీ బాలీవుడ్లో మన తెలుగుని మించిన నెపోటీజమ్ వుంది అని ఇప్పుడు సుశాంత్ సింగ్ మరణంతో మరోసారి తేటతెల్లమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ నటుడు కేవలం కొందరి స్వార్థానికి బలైపోయాడు. 34 ఏళ్ల చిన్న వయసులోనే ఆయనను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు కల్పించారు. సూపర్ స్టార్ గా ఎదుగుతాడు అనుకున్న క్రమంలోనే ఎవరూ ఊహించని రీతిలో అర్థాంతరంగా తనువు చాలించాడు సుశాంత్ రాజ్ పుత్. 

ఈయన బలవన్మరణానికి బాలీవుడ్ లో ఉన్న కొందరు కారణమంటూ శేఖర్ కపూర్, కంగనా రనౌత్, తాప్సీ లాంటి వాళ్ళు బయటికి వచ్చి మరీ చెబుతున్నారు. ముఖ్యంగా తన చివరి రోజుల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసికంగా చాలా హింస పెట్టారని.. అది ఒక రకంగా ఆయనను బతకనివ్వకుండా చేసిందని ఆరోపించారు. ఇండస్ట్రీలో కేవలం వారసులకు మాత్రమే అవకాశాలు వస్తాయని.. టన్నులకొద్దీ టాలెంట్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను మాత్రం కొందరు తొక్కేయాలని చూశారు అంటూ కంగన సంచలన కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు విన్న తర్వాత ఇది నిజమే అనిపించక మానదు. ఎందుకంటే బాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా అద్భుతమైన పాత్రలో కనిపించాడు సుశాంత్. కానీ ఆయనకు అవార్డులు మాత్రం రాలేదు. అంతేకాదు ఏ అవార్డు ఫంక్షన్లకు కూడా ఆయనను పిలవలేదు.. పార్టీలకు పట్టించుకోలేదు.

అందరూ కలిసి ఆయనను ఒంటరిని చేశారు. తమతో పోలిస్తే ఏమాత్రం నటించని వాళ్లను కూడా సూపర్ స్టార్ గా చూపిస్తున్నారు బాలీవుడ్ లో కొందరు. తన సినిమాలు చూడండి అంటూ ప్రేక్షకులను వేడుకునే స్థాయికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వచ్చాడు అంటే ఆయన ఏ స్థాయిలో మానసిక క్షోభకు గురి చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు సుశాంత్ మరణం ఆరేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ మరణాన్ని గుర్తు చేస్తుంది. ఆయనను కూడా ఇలాగే ఇండస్ట్రీలో కొందరు పెద్దలు మానసిక క్షోభకు గురి చేసి మరీ ఆత్మహత్య చేసుకునేలా చేశారు అంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీ కొందరి సొత్తుగా మారిపోయింది అనిపిస్తుంది. వాళ్లు కాకుండా బయట నుంచి సొంతంగా ఎవరైనా ఎదుగుతుంటే వాళ్లను వెనక్కి లాగేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయని తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదంతంతో మరోసారి అర్ధమైపోయింది. ఏదేమైనా దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా ఉన్న బాలీవుడ్ ను కేవలం కొందరు హస్తగతం చేసుకుని ఆడుకుంటున్నారు అనేది మాత్రం సుస్పష్టమైన విషయం. 

More Related Stories