కారెక్టర్ ఆర్టిస్టులుగా కుర్ర హీరోలు.. సుశాంత్ కు ఒరిగింది ఏంటి..

హిట్ రానపుడు.. మార్కెట్ లేనపుడు కూడా హీరోగా నటిస్తానంటే కుదరదు. సినిమా అంటే కోట్లతో చేసే వ్యాపారం. కచ్చితంగా హిట్స్ వచ్చినపుడే అవకాశాలు కూడా వస్తాయి. కానీ ఇండస్ట్రీలో కొందరు కుర్ర హీరోలు మాత్రం ఇప్పుడు తమ సిచ్యువేషన్ అర్థం చేసుకుని కారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు అది చేసారు.. ఇప్పుడు వారసులు కూడా ఇదే చేస్తున్నారు. గత ఏడాది అల్లరి నరేష్ మహర్షి కోసం కారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో నటించాడు నరేష్. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు నరేష్. మహర్షి తర్వాత వరస అవకాశాలు వస్తున్నాయి ఈయనకు. ఇప్పటి నుంచి కథ బాగుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు అల్లరి నరేష్. అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా బన్నీ అల వైకుంఠపురంలో సినిమాలో ఈయన ముఖ్య పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాతో ఆయనకు ఏమి ప్రత్యేకంగా కెరీర్ కి సాయపడింది అనేది మాత్రం అర్థం కావడం లేదు. సినిమాలో మాదిరి బయట కూడా ఆయన సైలెంట్ గా ఉన్నాడు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన నవదీప్ ఇప్పుడు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. మొత్తానికి వరస ఫ్లాపుల తర్వాత ఈ కుర్ర హీరోలు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలిక.