సైరా నరసింహా రెడ్డి రివ్యూchiru
2019-10-02 08:39:33

సైరా సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనలేదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా వేచి చూస్తున్నారు. మరి చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూద్దాం..

కథ:
18వ శతాబ్ధంలో రాయలసీమ ప్రాంతంలో పాలెగాళ్ల వ్యవస్థ ఉంటుంది. బ్రిటీష్ వాళ్ల కిందే వాళ్లు పని చేస్తుంటారు. రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి బ్రిటీష్ వాళ్లకు జమచేయాలి. అది వాళ్ల బాధ్యత. దాంతో పాటు తమ అదుపులో ఉన్న గ్రామాల్లోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసుకోవాలి. అందులో రేనాడులో ఉండే ఓ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి (చిరంజీవి). పక్కా రెబల్ ఆయన. అసలు బ్రిటీష్ వాళ్లకు పన్నులు ఎందుకు కట్టాలంటూ ఉద్యమం చేస్తాడు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు. అది బ్రిటీష్ సామ్రాజ్యానికి నచ్చదు. దాంతో ఉయ్యలవాడ వాళ్లపై తిరుగుబాటు చేస్తాడు. ఆయనకు తోడు తన గురువు గోసై వెంకన్న(అమితాబ్ బచ్చన్) కూడా గళం కలుపుతాడు. అక్కడ్నుంచి అసలు నరసింహా రెడ్డి ఏం చేసాడు అనేది అసలు కథ..

కథనం:
పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా.. ఝాన్సీ లక్ష్మీభాయిగా అనుష్క.. ఈ రెండు సన్నివేశాలతోనే సైరా సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అసలు సైరా సినిమా ఎలా ఉంటుందని థియేటర్స్ లోకి అడుగు పెడతారో.. దానికి వంద రెట్లు అభిమానులకు అందించాడు చిరంజీవి. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా తనకు ఇచ్చిన బాధ్యతను దాదాపు నిర్వర్తించాడు. అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు మినహా ఆయన కూడా సైరాను చిరస్థాయిగా మిగిలిపోయేలాగే తెరకెక్కించాడు. 64 ఏళ్ళ వయసులో చిరంజీవి ఎనర్జీ చూసి అంతా షాక్ అవుతున్నారు. సినిమా మొదలవ్వడంతోనే కథలోకి వెళ్లాడు సురేందర్ రెడ్డి. అయితే కారెక్టర్ ఇంట్రో కోసం చాలా టైమ్ తీసుకోవడం.. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగడం ఒక్కటే సైరాకు మైనస్. అప్పటి పరిస్థితులను ప్రేక్షకులకు ఆకలింపు చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇదే సైరాకు మైనస్ గా మారుతుంది. చిరంజీవి యాక్షన్ చూడాలని కలలు కంటున్న వాళ్లకు ఇంటర్వెల్ వరకు వెయిట్ చేయించాడు దర్శకుడు. అయితే అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ తో సినిమా స్వరూపమే మారిపోతుంది. తొలిసారి కోయలకుంట్ల ఖజానాపై ఉయ్యాలవాడ దండెత్తే సీన్ రాజమౌళి రేంజ్ లో తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. అది అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ మూవెంట్స్. ఇక చిరంజీవి కూడా ప్రాణం పోసాడు ఈ సన్నివేశానికి. అక్కడ్నుంచి మరో 50 నిమిషాల పాటు ఎక్కడా ఆగకుండా పరుగులు తీస్తుంది. సెకండాఫ్ కూడా హై రేంజ్ లోనే మొదలవుతుంది. సెకండాఫ్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు.. ఉయ్యాలవాడకు సపోర్టుగా ఉండే పాత్రలు ఇవన్నీ సినిమా రేంజ్ మార్చేసాయి. క్లైమాక్స్ 30 నిమిషాలు కంటతడి పెట్టించడమే కాకుండా దేశభక్తిని రేకెత్తించే విధంగానూ ఉంది. అయితే అక్కడక్కడా స్లో నెరేషన్ సినిమాకు మైనస్ గా మారింది. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమా స్థాయిని పెంచేసాయి. ముఖ్యంగా నరసింహా రెడ్డి సైన్యం 10 వేల మంది బ్రిటీష్ సైన్యాన్ని ఓడించే సీన్.. తొలిసారి ఖజానాపై దండెత్తే సన్నివేశం.. అడవిలో వచ్చే సన్నివేశాలు ఇవన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఉయ్యాలవాడ కథ తెలిసిన వాళ్లకే కాకుండా తెలియని వాళ్లకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

నటీనటులు:
చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో ప్రాణం పోసాడు. ఆయన నటించాడు అని చెప్పడం కూడా తప్పే.. జీవం పోసాడు. నిజంగానే ఉయ్యాలవాడ ఉంటే ఇలాగే ఉండేవాడేమో అనేంతగా నటించాడు ఈయన. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చిరు ఏజ్ అస్సలు కనిపించలేదు. నయనతార సిద్ధమ్మగా బాగా నటించింది. తమన్నా లక్ష్మీగా బాగా నటించింది. అమితాబ్ బచ్చన్ పాత్ర సినిమాకు ప్రాణం. ఉయ్యాలవాడకు వెన్నుదన్నే ఉండే పాత్ర ఇది. విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, రవికిషన్ ఇలా అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:
సైరాకు అద్భుతమైన సంగీతం అందించాడు అమిత్ త్రివేది. ఈయన మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేసింది. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. పాటలు రెండే ఉన్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగింది. సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. సురేందర్ రెడ్డి దర్శకుడిగా తన సత్తా చూపించాడు కానీ ఇంకాస్త పర్ఫెక్ట్ ఔట్ పుట్ ఇచ్చుంటే అదిరిపోయేది. కథను ఇంకాస్త మెరుగ్గా చెప్పే ప్రయత్నం చేసుండాల్సిందేమో అనిపించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
సైరా నరసింహా రెడ్డి.. మెగాస్టార్ మెగా విజువల్ వండర్..

More Related Stories