మన హీరోలకు పాన్ ఇండియా కథల పిచ్చి పట్టుకుందా.. Tollywood
2020-03-21 20:20:07

ఒకప్పుడు మన హీరోలంతా తెలుగు ప్రేక్షకులను అలరిస్తే చాలు.. ఇక్కడ విజయం అందుకుంటే చాలు కానీ ఆశపడే వాళ్ళు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో.. అప్పట్నుంచి నుంచి మన దర్శకులు హీరోలు ఆలోచన శైలి మారిపోయింది. తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో కూడా మంచి డిమాండ్ వుందని తెలుసుకున్న తర్వాత పాన్ ఇండియా కథల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి తెలుగులో తప్ప అన్ని భాషల్లో డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు బాలీవుడ్ ను ఎక్కువగా ఫోకస్ చేసి సాహో సౌత్ లో డిజాస్టర్ అయ్యింది. పాన్ ఇండియా కథలు అనుకుంటూ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావడం లేదు. బాహుబలికి మాత్రమే అది సాధ్యమైంది. అయితే ఆ సినిమా అండ చూసుకొని ఇప్పుడు మన హీరోలు చాలామంది పాన్ ఇండియా వైపు పరుగులు తీస్తున్నారు. మంచు మనోజ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తమ సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు దర్శక ధీరుడు అండగా ఉన్నాడు. అయితే మిగిలిన సినిమాలపై మాత్రం అంతగా అంచనాలు కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ సినిమా కూడా ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి కూడా అన్ని భాషల్లో విడుదల కానుంది. తాజాగా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా అన్ని భాషలపై ఫోకస్ చేశారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న సినిమాను ఇండియా అంతా కూడా విడుదల చేయాలని ప్లాన్ చేసినా బడ్జెట్ మరీ ఎక్కువ అవుతుండటంతో వెనక్కి తగ్గుతున్నారు నిర్మాతలు. మరో వైపు మహేష్ బాబుకు పాన్ ఇండియా కథ రావడం లేదు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఈయన ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇది అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇక అల్లు అర్జున్ కూడా సరైన స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాడు. ఎటు చూసుకున్న కూడా మన హీరోల దృష్టి ఇప్పుడు తెలుగు మాత్రమే కాదు అన్ని భాషలపై ఉంది.

More Related Stories