English   

నాలుగు సినిమాల్లో విన్నర్ ఎవరు..?

kirrak-party-karthvyam
2018-03-16 18:47:37

ఈ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. రెండు స్ట్రెయిట్ మూవీస్. రెండు డబ్బింగ్ సినిమాలు. మరి ఈ నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ విజేత ఎవరు..? ఓ సినిమా చాలా బావుంది. కానీ కలెక్షన్లు వస్తాయనే గ్యారెంటీ లేదు. మరో సినిమాపై హైప్ ఉంది. బట్ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాలేదు. మరో సినిమా కేవలం బి సి సెంటర్లే టార్గెట్ గా వచ్చింది. ఎంత వరకూ రీచ్ అవుతుందో చెప్పలేం. ఇక కుర్రాళ్ల సినిమాకు హడావిడే తప్ప అసలు మేటర్ లేదనే టాక్ ఉంది. మొత్తంగా ఈ ఫ్రైడే మిక్స్ డ్ రిజల్ట్ తో కాస్త చిత్రమైన పరిస్థితుల్లో ఉంది. 

ఇవాళ విడుదలైన సినిమాల్లో కాస్త అందరికీ తెలిసిన సినిమా కిరాక్ పార్టీ. నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా. 2016లో కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీకి రీమేక్ ఇది. మొదట్లో కాస్త హైప్ తెచ్చే ప్రయత్నం చేసింది టీమ్. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ డల్ అయిపోయింది. ప్రమోషన్స్ వీక్ అయిపోయాయి. కారణమేంటా అని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. ఇది వాళ్లకు ముందే తెలుసని. జస్ట్ యావరేజ్ సినిమాగా కిరాక్ పార్టీ నిలిచిపోయింది. ఒరిజినల్ ను ఏ మాత్రం రీచ్ కాలేకపోయిందనే టాక్ తెచ్చుకుంది. 

ఇక లేడీ సూపర్ స్టార్ గా మారిన నయనతార ప్రధాన పాత్రలో కర్తవ్యం ఇవాళే వచ్చింది. ఆరమ్ గా తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు.. విమర్శకులను విపరీతంగా మెప్పించిన సినిమా ఇది. హార్ట్ బ్రేకింగ్ మూవీగా అందరి ప్రశంసలూ అందుకుంటోంది. కానీ ఇలాంటి సినిమాకు తెలుగులో ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది.. ముఖ్యంగా కమర్షియల్ గా.. వేచి చూడాల్సిన విషయం. కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా కర్తవ్యం ను చెప్పొచ్చు.

దండుపాళ్యం అంటూ మూడేళ్ల క్రితం దక్షిణాది మొత్తాన్ని ఊపేశాడు దర్శకుడు శ్రీనివాస్ రాజు. కన్నడలో రూపొందిన ఈ మూవీ తర్వాత అన్ని భాషల్లోకీ డబ్ అయింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన రెండో భాగం కూడా ఆకట్టుకుంది. ఇవాళ ఈ సిరీస్ లో చివరి సినిమాగా దండుపాళ్యం-3 వచ్చింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకుంది. వల్గారిటీ, హింస అన్నీ తెలిసినవే కాబట్టి.. ఇది కేవలం బి సి సెంటర్ ప్రేక్షకులనే మెప్పించే చాన్సుంది. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ బ్యాచ్ గురించి కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఆ ప్రయత్నం కమర్షియల్ గా ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

ఇక దశాబ్ధంన్నర క్రితం ఐతే.. అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు అనే క్యాప్షన్ తో వచ్చిన క్రేజీ మూవీ అప్పట్లో ఒక వర్గం ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. ఇప్పుడా మూవీకి ఇది సీక్వెల్ అని చెప్పలేం గాని అదే టైటిల్ తో ఐతే 2.0 అంటూ సినిమా విడుదలైంది. రాజ్ మాదిరాజ్ డైరక్ట్ చేసిన ఈ మూవీపై పెద్దగా అంచనాల్లేవు. కాకపోతే యూత్ టార్గెట్ గా వచ్చినా వారిలో క్యూరియాసిటీ పెంచడంలో ట్రైలర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ లేకపోవడం మైనస్ అయింది. ఓవరాల్ గా ఈ ఫ్రైడే థియేటర్స్ కు కళ తెచ్చింది కానీ బాక్సాఫీస్ కు జోష్ తేలేకపోయిందనే చెప్పాలి. నాలుగు సినిమాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా లేదు. సో.. ఆడియన్స్ మరో వారం వరకూ వేచి చూడాల్సిందేనేమో.

More Related Stories