English   

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు పాజ‌టివ్ టాక్..!

Chi-La-Sow

ప్ర‌తీ శుక్ర‌వారం అర‌డ‌జ‌న్ సినిమాల‌కు త‌క్కువ కాకుండా విడుద‌ల కావ‌డం.. అన్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డం. కొన్ని వారాల నుంచి తెలుగు సినిమా చూస్తున్న సీన్ ఇదే. గ‌త నెల రోజుల్లో ఒక్క ఆర్ఎక్స్ 100 మాత్ర‌మే విజ‌యం సాధించింది. అయితే ఇది కూడా పూర్తిస్థాయి పాజిటివ్ చిత్రం కాదు. పూర్తిగా అడ‌ల్ట్ ఓరియెంటెడ్ సినిమా. యూత్ ఓట్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయింది. చివ‌ర‌గా స‌మ్మోహ‌నం త‌ర్వాత ఆ స్థాయిలో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. స‌మ్మోహ‌నంకు వ‌చ్చినా కూడా అది హిట్ కాలేదు. 

ఇక ఈ వారం మ‌ళ్లీ రెండు సినిమాల‌కు టాక్ బాగా వ‌చ్చింది. చిల‌సౌతో పాటు అడ‌విశేష్ గూఢ‌చారి సినిమాలు బాగున్నాయ‌ని తేల్చేసారు ప్రేక్ష‌కులు. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ ను బ‌ట్టే సినిమా రేంజ్ కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. అడ‌విశేష్ ఇప్ప‌టికే క్ష‌ణంతో త‌న‌ను తాను నిరూపించుకున్నాడు కాబ‌ట్టి ముందు నుంచీ అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇక చిల‌సౌ ట్రైల‌ర్స్ తో ఆక‌ట్టుకుని మంచి ఓపెనింగ్స్ పై క‌న్నేసింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ఈ రెండు సినిమాలు బాగానే ఆడుతున్నాయి. 104 లొకేష‌న్స్ లో గూఢ‌చారి 53 వేల డాల‌ర్లు వ‌సూలు చేస్తే.. 74 స్క్రీన్స్ లో చిల‌సౌ పాతిక వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఈ సినిమా స్థాయికి ఇది ఎక్కువే. టాక్ ఎలాగూ బాగానే ఉంది కాబ‌ట్టి ఇంటా బ‌య‌టా క‌చ్చితంగా ఈ రెండు సినిమాలు బాగానే ఆడేలా క‌నిపిస్తున్నాయి. ఇదే జోరు వ‌చ్చే వారం శ్రీ‌నివాస క‌ళ్యాణంతోనూ కొన‌సాగితే ఇండ‌స్ట్రీ పంట పండిన‌ట్లే..!

More Related Stories