English   

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్...చిత్రయానం

Guna Sekhar Birthday Special
2018-06-02 14:32:15

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఆయన పేరు ఒకదశలో మార్మోగిపోయింది. అరంగేట్రంలోనే అవార్డ్ లతో అదరగొట్టిన దర్శకుడు. ఎన్టీఆర్ ను బాలరాముడుగా చూపించిన ఘనత కూడా గుణశేఖర్ సొంతం. రీసెంట్ గా రుద్రమదేవితో చరిత్ర చెప్పిన ఈ దర్శకుడు త్వరలో ఓ పురాణగాధ చెబుతానంటున్నాడు. ఇవాళ గుణశేఖర్ బర్త్ డే. ఈ సందర్భంగా అతని చిత్రయానాన్ని బ్రీఫ్ గా గుర్తు చేసుకుందాం..

సినిమా కలతో పరిశ్రమలోకి వచ్చిన గుణశేఖర్ మొదట డివి నరసనరాజు, క్రాంతికుమార్, రామ్ గోపాల్ వర్మ వంటి విభిన్నమైన దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. అతిని మొదటి సినిమా లాఠీ. తొలి సినిమాకే బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నడు. ఆ తర్వాత నరేష్, ఇంద్రజ జంటగా సొగసు చూడతరమా అనే సినిమా చేశాడు. ఈ సినిమాకూ బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ గా నంది అవార్డ్ వచ్చింది. 1997 లో గుణశేఖర్ తెరకెక్కించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర స్థాయిలో నంది పురస్కారాలను అందుకుని.. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.

గుణశేఖర్ ముందు నుంచీ వైవిధ్యమైన కథలే ఎంచుకున్నాడు. అప్పటికి ఇండస్ట్రీలో రకరకాల మాస్ స్టోరీస్ రాజ్యమేలుతున్నా.. అతను మాత్రం డిఫరెంట్ గానే వెళ్లాడు. ఈ క్రమంలో జగపతిబాబుతో చేసిన మనోహరం ఏకంగా నాలుగు నంది అవార్డులు అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ గా, ఈ సినిమాలో నటించిన జగపతిబాబు, లయలకు బెస్ట్ యాక్టర్స్ గా, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కు బెస్ట్ ఎడిటర్ గా నంది పురస్కారాలు దక్కాయి. రెండు మూడు సినిమాలకే గుణశేఖర్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. దీంతో మనోహరం కంటే ముందే మెగాస్టార్ నుంచి పిలుపొచ్చింది. చిరంజీవి కదా అని కథల్లో రకరకాల మాస్ మసాలాలు నింపకుండా తన భార్యా బిడ్డల కోసం ఓ తండ్రి పడే తపనకు మాస్ ఎలిమెంట్స్ జోడించి.. చిరంజీవిని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అయితే తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో చేసిన మృగరాజు మాత్రం ఫ్లాప్ అయింది. 

2003 లో అతను దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్సకుడి పురస్కారంతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. 2003లో హయ్యొస్ట్ గ్రాసర్ గా రికార్డ్ సృష్టించింది. మహేష్ బాబుకు ఇదే ఫస్ట్ బ్లాక్ బస్టర్ కావడం విశేషం. తర్వాత వరుసగా మరో రెండు సినిమాలు మహేష్ తోనే చేశాడు. వీటిలో అర్జున్ సినిమా బానే ఉన్నా.. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కావడంతో కమర్షియల్ గా కాస్త వెనకడబింది. అయితే తర్వాత మహేష్ తోనే చేసిన సైనికుడు బాగా నిరాశపరిచింది. ఒక రకంగా సైనికుడు నుంచి గుణశేఖర్ కు ఫ్లాపులు మొదలయ్యాయనుకోవచ్చు.  సైనికుడు ఫ్లాప్ తో ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది గుణశేఖర్ కు. ఈ టైమ్ లో అల్లు అర్జున్ అతన్ని నమ్మాడు. ఐదు రోజుల పెళ్లి అంటూ అతనితో వరుడు చేశాడు. తమిళ నటుడు ఆర్య ను విలన్ గా పరిచయం చేసిన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.. అయితే తెలుగులో లిప్ లాక్ అనే ట్రెండ్ కు వరుడుతో తెరలేపాడు గుణశేఖర్.

వరుడు తర్వాత తన మిత్రుడు వైవియస్ చౌదరి నిర్మించిన నిప్పుతో మరోసారి దర్శకుడుగా విఫలమయ్యాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 2015లో రుద్రమదేవితో వచ్చాడు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు తనే నిర్మాత. కథగా బానే ఉన్నా.. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయనే పేరొచ్చింది. పైగా ఎప్పట్లానే ప్రొడక్షన్ కు విపరీతమైన ఖర్చుపెట్టాడు. దీంతో రుద్రమదేవికి ప్రశంసలు వచ్చినా పైసలు రాలేదు. మొత్తంగా ఇక ఇప్పుడు మార్కండేయుడి కథతో పురాణగాథ చెప్పాలనుకుంటున్నాడు గుణశేఖర్. ఈ సినిమాకు రానాను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. మరి అతని ప్రయత్నం సక్సెస్ కావాలని.. మళ్లీ అతను హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటూ గుణశేఖర్ కు బర్త్ డే విషెస్ చెబుదాం.. 

More Related Stories