English   

న‌వ్వుల గుండు ఇక క‌న‌బ‌డ‌దు..

Gundu Hanumantha Rao
2018-02-19 16:03:43

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నంత మంది క‌మెడియ‌న్లు మ‌రెక్క‌డా క‌నిపించ‌రు. దాదాపు 30 మంది క‌మెడియ‌న్లు ఇక్క‌డ ఉండేవాళ్లు అని ప్ర‌తీసారి గ‌ర్వంగా చెప్పుకునే వాళ్లు. అది చూసి ఎవ‌రికో క‌ళ్లు కుట్టిన‌ట్లున్నాయి. అందుకే కొన్నేళ్లుగా ఒక్కో క‌మెడియ‌న్ ను లోకం నుంచి దూరం చేస్తూ వ‌చ్చాడు దేవుడు. ఇప్పుడు మ‌రో క‌మెడియ‌న్ ను కూడా తీసుకెళ్లిపోయాడు. అత‌డే గుండు హ‌నుమంత‌రావు. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ న‌టుడు 400 కి పైగా సినిమాల్లో న‌టించాడు. అద్భుత‌మైన న‌ట‌నతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయచేసాడు.  కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న ఈయ‌న‌.. అనారోగ్యంతో బాధ ప‌డుతున్నాడు. డ‌యాల‌సిస్ కోసమే ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసాడు ఈ సీనియ‌ర్ క‌మెడియ‌న్. 
అన్ని సినిమాలు చేసినా కూడా చివ‌రి రోజుల్లో చేతుల్లో ఏం లేకుండానే క‌న్ను మూసాడు గుండు హ‌నుమంత‌రావు. ఫిబ్ర‌వ‌రి 19న ఎస్ ఆర్ న‌గ‌ర్ లోని త‌న ఇంట్లోనే క‌న్నుమూసాడు గుండు. సీరియ‌స్ కావ‌డంతో ప‌క్క‌నే ఎర్ర‌గడ్డ‌లోని హాస్పిట‌ల్ కు త‌ర‌లించినా అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించారు. గుండు మృతి ప‌ట్ల తెలుగు ఇండ‌స్ట్రీ సంతాపం ప్ర‌క‌టించింది. ఈ మ‌ధ్యే గుండు హ‌న్మంత‌రావు ఆర్థిక ప‌రిస్థితి గురించి తెలుసుకుని చిరంజీవి కూడా త‌న ఇంటికి పిలిపించి 2 ల‌క్ష‌లు ఆర్థిక‌సాయం చేసాడు. ఇక తెలంగాణ ప్ర‌భుత్వం కూడా సిఎం స‌హాయ‌నిధి నుంచి 5లక్షలు ఇచ్చింది. అయితే ఇవేవీ ఆయ‌న అనారోగ్యాన్ని బ‌య‌ట‌ప‌డేయ‌లేక‌పోయాయి.

ఆయ‌న ప‌రిస్థితి తెలుసుకుని అలీ కూడా గుండు హనుమంతరావు అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తాన‌ని మాటిచ్చాడు కూడా. దాంతో చాలా సంతోష ప‌డ్డాడు గుండు. కానీ అంత‌లోనే ఆయ‌న త‌నువు చాలించ‌డం శోచ‌నీయం. 1956, అక్టోబర్‌ 10న విజయవాడలో జన్మించాడు గుండు హ‌నుమంత రావు. సినిమాల్లోకి రాకముందు కొన్నేళ్లు మిఠాయి వ్యాపారం చేశారు. అనంతరం సత్యాగ్రహం సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. చాలా త‌క్కువ టైమ్ లోనే 400 లకు పైగా సినిమాల్లో నటించాడు గుండు. టిపిక‌ల్ కామెడీ టైమింగ్ తో అంద‌ర్నీ క‌డుపుబ్బా న‌వ్వించారు. ముఖ్యంగా అహ నా పెళ్లంటలో విన‌బ‌డ‌లా అంటూ గుండు చేసిన కామెడీ ఇప్ప‌టికీ గుర్తే. 
ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో చేసిన‌ మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు.. ఎస్వీ కృష్ణారెడ్డితో యమలీల, టాప్‌ హీరో, శుభలగ్నం, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాలు.. క్రిమిన‌ల్, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్ లాంటి ఎన్నో సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించాడు గుండు హ‌నుమంత‌రావు. ఇక చిన్నితెర‌పై కూడా త‌న న‌ట‌న చూపించాడు గుండు. ఈయ‌న న‌టించిన అమృతం సీరియ‌ల్ ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ అద్భుతం. ఇందులో ఆయ‌న చేసిన అంజి పాత్ర గురించి చెప్ప‌డానికి మాట‌ల్లేవంతే. 30 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉంటూ.. త‌న కామెడీతో క‌డుపులు చెక్క‌లు చేసిన గుండు హ‌నుమంత‌రావు.. ఇప్పుడు ఇలా వెళ్లిపోయి అంద‌రితోనూ కంట‌ప‌డి పెట్టిస్తున్నారు. 

More Related Stories