English   

దిలీప్ కుమార్ టు అల్లా రఖా రెహమాన్...హ్యాపీ బర్త్ డే !

Happy Birthday To Music Director AR Rahman
2019-01-06 12:26:47

మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ కుమార్ అంటే ఎవరబ్బా అని ఆలోచిస్తారేమో కానీ ఏ.ఆర్. రెహమాన్ అంటే మాత్రం ఎవరు గుర్తుపట్టరు ?. తన పేరునే తన మ్యూజిక్ కి బ్రాండ్ గా మార్చేసుకున్నాడు ఆయన. ఇండియా నుండి వచ్చిన ఈయన ప్రపంచ నలుమూలలకు సుపరిచితం అయిపోయాడు అది కూడా కేవలం తన సంగీతంతో. ఇండస్ట్రీలో అత్యంత సౌమ్యుడిగా పేరున్న ఆయన రెండు ఆస్కార్ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకొని తన సంగీత ప్రయాణాన్ని దిగ్విజియంగా కొనసాగిస్తున్నారు. దిలీప్ కుమార్ గా 1967 జనవరి 6 న ఆర్ కే శేఖర్, కస్తూరి దంపతులకు తమిళనాడులోని చెన్నై లో జన్మించిన ఆయన కీ బోర్డు ప్లేయర్ గా మొదలైన తన సంగీత ప్రయాణంలో ఎం.స్.స్వామినాథన్, ఇళయరాజ, రమేష్ నాయుడు, రాజ్-కోటి వంటి దిగ్గజాల వద్ద శిష్యరికం చేశాడు. అయితే ఆయన ఇస్లాంలోకి ఏ సందర్భంలో మారాల్సి వచ్చింది, దిలీప్ కుమార్ రెహ్మాన్‌గా ఎలా మారాడో ఆయనే స్వయంగా వెల్లడించారు. దిలీప్‌ కి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు వీరి తండ్రి సంగీత దర్శకుడు. దిలీప్ తొమ్మిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోగా తండ్రి వినియోగించిన సంగీత పరికరాలను అద్దెకిస్తూ కుటుంబం జీవనం సాగించింది. అయితే ఆ సంపాదన చాలాకపోవడంతో 11 ఏళ్లకే తల్లితో కలిసి కుటుంబ భారాన్ని మోసేందుకు సిద్ధమయ్యాడు దిలీప్. సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్, పియానో లాంటి వాయిద్యాలు వాయించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే తన చెల్లి అనారోగ్య సమస్యలతో వుండగా ఒక ముస్లిం స్నేహితుడు ఇచ్చిన సలహా ప్రకారం ఇస్లాం మతంలో చేరి రెహమాన్ గా మారిపోయాడు దిలీప్ కుమార్. అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కొరకు వెతుకుతున్న దర్శకుడు మణిరత్నం కు రెహమాన్ అందిస్తున్న ట్యూన్స్ కొత్తగా వుండడంతో రోజాకి రెహమాన్ నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఆ మూవీ, అందులోని సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత మణిరత్నం సినిమాలకు ఎక్కువగా రెహమానే మ్యూజిక్ ని ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ గురించి అందరికీ తెల్సిందే. తన సంగీత ప్రపంచంలో రెహమాన్ ఎన్నో అవార్డులను,రివార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు 4 నేషనల్ అవార్డులు,6 తమిళ నాడు స్టేట్ అవార్డ్స్,15 ఫిలింఫేర్ అవార్డ్స్ మరియు 13 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు భారత ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా అందించే పద్మశ్రీ ని, 2009 లో స్లగ్ డాగ్ మిలినియర్ మూవీ కి అందించిన సంగీతానికి సినిమా వారికి అత్యంత విశిష్టమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు.  నేడు రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మాయీ శుభాకాంక్షలు.

More Related Stories