HBD Mahesh Babu 45 వసంతాల రాజకుమారుడు..

మహేష్ బాబు.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమ్మాయిల కలల రాకుమారుడు.. అందానికి ఆధార్ కార్డు.. అబ్బాయిలు కూడా అసూయపడే అందం.. చూడగానే కొరుక్కు తినాలి అనిపించే గ్లామర్.. ఇవన్నీ మహేష్ బాబు సొంతం. ఆగస్టు 9 ఈయన పుట్టిన రోజు. 45 వసంతాలు పూర్తి చేసుకుని 46 లోకి అడుగుపెడుతున్న సూపర్ స్టార్. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నాలుగేళ్ల వయసులోనే నీడ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్. ఆ తర్వాత గూడచారి, కొడుకు దిద్దిన కాపురం, బాల చంద్రుడు లాంటి సినిమాలు చేశాడు.
అది 1999.. జులై 30.. ఆ రోజే మహేశ్ రాజకుమారుడు విడుదలైంది. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి దూసుకొచ్చాడు మహేశ్. అశ్వినీదత్ నిర్మాతగా రాఘవేంద్రరావ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. అప్పట్లో ఈ చిత్రం ఓ సంచలనం. రాజకుమారుడుతోనే ప్రిన్స్ అనే ముద్ర కూడా వేయించుకున్నాడు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. మణిశర్మ అందించిన పాటలు అప్పట్లో సంచలన విజయం సాధించాయి.
సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ అప్పియరెన్స్.. ప్రకాష్ రాజ్ స్పెషల్ పర్ఫార్మెన్స్.. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా అందాలు.. మహేష్ బాబు అభినయం అన్ని కలిసి రాజకుమారుడిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఆ తర్వాత యువరాజు.. మురారి.. ఒక్కడు.. అతడు.. పోకిరి.. దూకుడు.. సీతమ్మ వాకిట్లో.. బిజినెస్ మ్యాన్.. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. సరిలేరు నీకెవ్వరు మహర్షి.. లాంటి సినిమాలతో మహేష్ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్. దాంతో పాటు మరో రో సినిమాకు కమిటయ్యాడు. మొత్తానికి ఇన్నేళ్ల కెరీర్లో ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకుండా మిస్టర్ క్లీన్ అనిపించుకున్నాడు మహేశ్ బాబు. ఈ ప్రయాణంలో 7 నందులు.. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు మహేష్. సూపర్ స్టార్ ప్రయాణం ఇలాగే కొనసాగాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.