English   

హిట్ రివ్యూ

HIT Movie Review
2020-02-28 20:28:09

నాని నిర్మాతగా మారుతున్నాడు అన్నపుడు అంతా బాబోయ్ అనుకున్నారు. కానీ నిర్మించిన తొలి సినిమా అ.. తోనే రెండు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అలాంటి న్యాచురల్ స్టార్ రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా హిట్ సినిమా నిర్మించాడు. మరి ఈ కాప్ డ్రామాతో నాని నిర్మాతగా ఎంతవరకు ప్రేక్షకులను అలరించాడో చూద్దాం..

కథ :

విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పోలీస్ ఆఫీసర్. తన ఇంటలిజెన్స్ తో చాలా కేసులు పరిష్కరిస్తాడు. కానీ క్రైమ్ చూసిన ప్రతీసారి కూడా ఆయన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల గుర్తు చేసుకుని ప్యానిక్ అవుతుంటాడు. దాంతో అనారోగ్యం కారణాల వల్ల కొన్ని రోజుల పాటు సెలవు తీసుకుంటాడు. అదే సమయంలో తన గాళ్ ఫ్రెండ్ నేహా (రుహానీ శర్మ) మిస్ అయిందని తెలుసుకుని మళ్లీ డ్యూటీలోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ కేసు అప్పుడే ప్రీతి(సాహితి) అనే అమ్మాయి మిస్సింగ్ కేసుతో లింక్ ఉందని తెలుస్తుంది. ఈ రెండు కేసులను విక్రమ్ హ్యాండిల్ చేస్తాడు. అసలు ప్రీతికి ఏమైంది.. ఆ కేసుతో నేహాకు ఏంటి సంబంధం అనేది అసలు కథ..

కథనం:

15 నిమిషాలు మీరు థియేటర్‌లో కూర్చోండి.. ఆ తర్వాత నేను కూర్చోబెడతా. హిట్ సినిమా గురించి విశ్వక్ సేన్ చెప్పిన మాటలు ఇవి.. మధ్యలో పాస్ పోసుకోడానికి కూడా మీకు గ్యాప్ ఉండదని చెప్పాడు.. ఈయన చెప్పిన స్థాయిలో సినిమా లేదు కానీ కచ్చితంగా చూడదగ్గ కాప్ డ్రామా.. పాటలు లేవు.. కామెడీ ఉండదు.. కమర్షియల్ హంగులు కూడా తక్కువే.. కేవలం ఓ కేస్ పట్టుకుని సినిమా అంతా ఇన్వెస్టిగేట్ చేయడం అంటే మాటలు కాదు..

స్క్రీన్ ప్లే పక్కాగా ఉంటే కానీ సినిమా ముందుకెళ్లదు.. కొత్త దర్శకుడు శేలేష్ అదే చేసాడు.. చిన్న పాయింట్ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం ఆసక్తికరంగానే రాసుకున్నాడు.. అయితే ఒకే కేస్‌పై ముందుకెళ్లే కథ కావడంతో అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించింది.. ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు తెలుగులో కొత్త కాదు.. కానీ హిట్ మాత్రం కొత్తగా తీసాడు దర్శకుడు.. డీటైలింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు శేలేష్ కొలను.. చిన్న పాయింట్ కూడా వదలకుండా ప్రాపర్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.. 

ఓ అమ్మాయి మిస్ కావడం.. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా.. మధ్యలో ఎవరెవరిపైనో అనుమానాలు.. చివర్లో ఎవరూ ఊహించని క్రిమినల్.. ఇవన్నీ ఇదివరకు కూడా చూసాం కానీ ఇందులో ఇంకాస్త ఫ్రెష్‌గా అనిపిస్తుంది.. నాని ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్‌‌గా చూసుకుంటే హిట్.. ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామా. సీక్వెల్ కూడా ఉందని ముందే చెప్పేసాడు దర్శకుడు శేలేష్. సినిమాలో కూడా సెకండ్ కేస్ కోసం ఓ లీడ్ వదిలాడు.

నటీనటులు:

విశ్వక్ సేన్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు.. సీరియస్ పాత్రలో చాలా సీరియస్‌గా నటించాడు విశ్వక్ సేన్.. రుహానీ శర్మ పర్లేదు.. మురళీ శర్మ, భానుచందర్ బాగానే సపోర్ట్ చేసారు..ప్రీతి అనే అమ్మాయిగా సాహితి బాగున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ప్రధాన బలం. ముఖ్యంగా పాటలు లేని సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ దే ప్రధాన ఆకర్షణ అయి ఉండాలి. ఈ విషయంలో వివేక్ నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే అక్కడక్కడా సేమ్ సీన్స్ రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో కాస్త ల్యాగ్ అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు శేలేష్ కొలను తను రాసుకున్న కథ కంటే కూడా స్క్రీన్ ప్లే మరింత పకడ్భందీగా రాసుకున్నాడు. తొలి సినిమానే అయినా కూడా అద్భుతంగా వర్కవట్ చేసుకున్నాడు. క్రైమ్ జోనర్ ప్రేక్షకులకు హిట్ పండగే.

చివరగా:

క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్‌లో హిట్..

రేటింగ్: 2.75/5.

More Related Stories