English   

ఇద్దరి లోకం ఒకటే రివ్యూ

Iddari Lokam Okate Review
2019-12-25 22:39:13

రాజ్ తరుణ్ సినిమా అంటే ఇప్పుడు పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు ప్రేక్షకుల్లో. వరస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చినా కూడా అంతే వేగంగా పడిపోయాడు రాజ్. దాంతో ఈయన సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే అంటూ వచ్చాడు రాజ్ తరుణ్. మరి ఇది ఎలా ఉందో చూద్దాం..

కథ:

మహి (రాజ్‌ తరుణ్‌), వర్ష (షాలిని పాండే) చిన్నప్పటి స్నేహితులు. ఒకరంటే ఒకరు ప్రాణం. అలాగే పెరుగుతారు కూడా. అయితే అనుకోకుండా 8 ఏళ్ల వయస్సులో ఈ ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత ఏకంగా 18 ఏళ్ళకు కలుస్తారు. మహి అప్పటికి ఓ ఫోటో‌గ్రాఫర్ అవుతాడు. మరోవైపు వర్షకు హీరోయిన్ కావాలని కోరిక ఉంటుంది. ఆ సమయంలోనే మహి ఏర్పాటు చేసిన ఓ ఫోటో ఎగ్జిబిషన్‌లో ఇద్దరూ కలుస్తారు. అప్పటికే ఆమెకు రాహుల్ (రాజా)తో నిశ్చితార్థం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిన మహికు హెల్త్ పరంగా ఓ సమస్య ఉంటుంది. దాంతో తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు. కానీ విధికి వీళ్లద్దరిని కలపాలని ఉంటుంది. ఏ విధంగా వీరిద్దరిని ఒకటి చేసింది. మహికు ఉన్న అనారోగ్యం ఏంటి.. వర్ష నటిగా మారిందా లేదా.. అసలు రాహుల్ ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చాడనేది అసలు కథ..

కథనం:

తెలుగు ఇండస్ట్రీలో ప్రేమకథలు ఇప్పట్నుంచి కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం. కాకపోతే ట్రీట్మెంట్‌లో కొత్తదనం ఉండాలంతే. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా మరోసారి ప్రేమకథతోనే వచ్చాడు. ఈయన ఇద్దరి లోకం ఒకటే అంటూ దిల్ రాజును కూడా తోడు తీసుకుని వచ్చాడు. దాంతో ఆసక్తి పెరిగిపోయింది. కానీ దర్శకుడు ప్రేమకథ బాగానే రాసుకున్నా కూడా తీసుకున్న లైన్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసినట్లుగానే ఉండటంతో కొత్తదనం లేక అల్లాడిపోయింది ఇద్దరి లోకం ఒకటే. పుట్టకతోనే ఒకరి కోసం ఒకరు అనేలా కథ ఉన్నా కూడా సీన్స్ పరంగా మాత్రం అది కనిపించలేదు. హీరో హీరోయిన్ల మధ్య ఆ స్థాయిలో రక్తి కట్టించే సన్నివేశాలు లేవు. ఒక్క క్లైమాక్స్ లో మాత్రమే అలా అనిపించింది. లవ్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రాజ్ తరుణ్, శాలిని పాండే మధ్య అక్కడక్కడా మంచి సన్నివేశాలు వచ్చినా కూడా అది సినిమాను నిలబెట్టేవి అయితే కావు. ప్యూర్ ప్రేమకథ చూడాలనుకున్నా కూడా చాలా స్లో నెరేషన్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణ. అక్కడే అసలు తేడా కొడుతుంది. తెలిసిన స్క్రీన్ ప్లేతో పాటు స్లో నెరేషన్.. బోరింగ్ సన్నివేశాలు ఇద్దరి లోకం ఒకటే సినిమాకు మైనస్ అయిపోయాయి. ప్రేమకథ అయినా కూడా ఆ ఎమోషన్ గాని.. ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా బలమైన సన్నివేశాలు పడలేదు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని తీసాడు. డైరెక్టర్ స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా లవ్ డ్రామాలను లైక్ చేసే వారికైనా రీచ్ అయ్యేది. రాజ్ తరుణ్ కొత్తగా కనిపించడానికి.. నటించడానికి ప్రయత్నించాడు అదొక్కటే ఈ సినిమాకు ప్లస్ అయింది. అక్కడక్కడా మంచి సీన్స్ పలకరించాయి. ఓవరాల్ గా స్లో నెరేషన్ తో ఎటూ కాకుండా పోయింది ఇద్దరి లోకం ఒకటే. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తాయి.

నటీనటులు:

రాజ్ తరుణ్ పర్లేదు.. తన పాత్రలో చాలా వరకు మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక శాలిని పాండే పర్లేదు. ఆమె కూడా బాగానే చేసింది. మిగిలిన పాత్రల్లో అంతా జస్ట్ ఓకే అనిపించారు..

టెక్నికల్ టీం:

మిక్కీ జే మేయర్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలు కూడా అంతగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సమీర్ రెడ్డి చాలా మంచి వర్క్ చేసాడు. తమ్మిరాజు ఎడిటింగ్ చాలా వీక్. అనవసరపు సన్నివేశాలు వచ్చాయేమో అనిపించాయి. దర్శకుడిగా జిఆర్ కృష్ణ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు అనిపించింది. స్లో నెరేషన్ ఇద్దరి లోకం ఒకటే సినిమా కొంప ముంచేసింది.

చివరగా: ఇద్దరి లోకం ఒకటే.. కానీ ప్రేక్షక లోకం వేరు..

రేటింగ్: 2 /5.

More Related Stories