ఇర్ఫాన్ ఖాన్ ఎక్కువ రోజులు బతకడట..!

ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. స్వయంగా ఆయనే చెప్పాడు. తాను ఎన్ని రోజులు బతుకుతానో కూడా క్లారిటీ లేదంటున్నాడు ఈ లెజెండరీ నటుడు. ఎవరికైనా మరణం చాలా పెద్ద సమస్య. భయం కూడా. మనం ఉండగా అది రాదు.. అది వచ్చాక మనం ఉండం. కానీ ఎప్పుడు వస్తుందో ముందే తెలిస్తే మాత్రం దానికంటే నరకం మరోటి ఉండదు. ఇప్పుడు బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఇలాంటి జీవన్మరణ సమస్యే వచ్చి పడింది. ఈయన ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో ఈయన సైనికుడు సినిమాలో నటించాడు. ఇందులో విలన్ గా రప్ఫాడించాడు ఇర్ఫాన్. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో మరుపురాని సినిమాలు చేసాడు. పాన్ సింగ్ తోమర్ లాంటి సినిమాల్లో నటించి జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఆగస్ట్ 3న ఈయన నటించిన కార్వాన్ విడుదలైంది. ఈ చిత్రంతోనే దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.
హాలీవుడ్ లోనూ ఈయన ప్రయాణం సాగింది. అక్కడ జురాసిక్ వరల్డ్ లో నటించాడు ఇర్ఫాన్. ఇలాంటి అద్భుతమైన నటుడికి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఈయనకు వచ్చిన క్యాన్సర్ కు ట్రీట్మెంట్ అంత సులభం కాదు. ఇప్పటికే కొన్ని నెలలుగా లండన్ లోనే ఉండి చికిత్స చేయించుకుంటు న్నాడు ఇర్ఫాన్. ఈ మధ్యే విడుదలైన ఆయన ఫోటోలు చూసి అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. మరీ పీలగా సన్నబడిపోయి కనీసం చూడలేని విధంగా మారిపోయాడు ఇర్ఫాన్. ఈయనకు వచ్చిన కష్టం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయిపోతుంది. ఇక ఇప్పుడు తన ఆరోగ్యంపై మరో లేఖ రాసాడు ఇర్ఫాన్. తను కొన్ని నెలల కంటే ఎక్కువ బతకనని చెప్పేసాడు. ఇలా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఎన్నాళ్లుంటానో తెలియదు కానీ ఉన్నన్నాళ్లూ హాయిగా ఉంటానంటున్నాడు ఇర్ఫాన్ ఖాన్. మరి ఆయనకు త్వరగా నయం కావాలని మనం కూడా కోరుకుందాం..!