English   

ప్రాణాల‌తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్.. 

Irrfan-Khan
2018-07-20 19:30:02

ఎవ‌రికైనా మ‌ర‌ణం అనేది చాలా పెద్ద స‌మ‌స్య‌. భ‌యం కూడా. మ‌నం ఉండగా అది రాదు.. అది వ‌చ్చాక మ‌నం ఉండం. కానీ ఎప్పుడు వ‌స్తుందో ముందే తెలిస్తే మాత్రం దానికంటే న‌ర‌కం మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఇలాంటి జీవన్మ‌ర‌ణ స‌మ‌స్యే వ‌చ్చి ప‌డింది. ఈయ‌న ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మే. తెలుగులో ఈయ‌న సైనికుడు సినిమాలో న‌టించాడు. ఇందులో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు ఇర్ఫాన్. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ఎన్నో మ‌రుపురాని సినిమాలు చేసాడు. పాన్ సింగ్ తోమ‌ర్ లాంటి సినిమాల్లో న‌టించి జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన కార్వాన్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో త‌న కామెడీ టైమింగ్ తో క‌డుపులు చెక్క‌లు చేసాడు ఇర్ఫాన్ ఖాన్. ఆగ‌స్ట్ 3న రానుంది ఈ చిత్రం. దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ చిత్రంతో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్నాడు. 

హాలీవుడ్ లోనూ ఈయ‌న ప్ర‌యాణం సాగింది. అక్క‌డ జురాసిక్ వ‌ర‌ల్డ్ లో న‌టించాడు ఇర్ఫాన్. ఇలాంటి అద్భుత‌మైన న‌టుడికి ఇప్పుడు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. ఈయ‌నకు వ‌చ్చిన క్యాన్స‌ర్ కు ట్రీట్మెంట్ అంత సుల‌భం కాదు. ఇప్ప‌టికే కొన్ని నెల‌లుగా లండ‌న్ లోనే ఉండి చికిత్స చేయించుకుంటు న్నాడు ఇర్ఫాన్. ఇప్పుడు విడుద‌లైన ఆయ‌న ఫోటోలు చూసి అభిమానులు కూడా క‌న్నీరు పెట్టుకుంటున్నారు. మ‌రీ పీల‌గా స‌న్న‌బ‌డిపోయి క‌నీసం చూడ‌లేని విధంగా మారిపోయాడు ఇర్ఫాన్. ఈయ‌న‌కు వ‌చ్చిన క‌ష్టం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయిపోతుంది. ఇలాంటి స‌మ‌యంలో ఈయ‌న‌కు సన్నిహితులు.. స‌హ‌చ‌ర న‌టుడు.. స్నేహితులు అండగా నిల‌బ‌డుతున్నారు. అయితే వీలైనంత త్వ‌ర‌లోనే ఈయ‌న‌కు న‌యం అవుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతుండ‌టంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

More Related Stories