English   

భ‌ర‌త్ కు నిజంగా 200 వ‌చ్చాయా..? 

mahesh-koratala-siva
2018-05-14 17:53:22

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో ఫేక్ రికార్డుల గోల ఎక్కువైపోయింది. ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వ‌స్తే.. క‌చ్చితంగా 100 కోట్లు.. 150 కోట్లు అంటూ వేసుకోవ‌డం ఆన‌వాయితీగా మారిపోయింది. క‌నీసం 100 కోట్లు కూడా రాక‌పోతే త‌మ స్టార్ డ‌మ్ దెబ్బ తింటుంద‌ని అనుకుంటున్నారేమో కానీ ప్ర‌తీ సినిమాకు సెంచ‌రీ అంటున్నారు. నిన్న‌గాక మొన్న విడుద‌లైన నా పేరు సూర్య కూడా 101 కోట్ల గ్రాస్ అంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఈ చిత్రం నిజానికి ఫ్లాప్.. కానీ ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం విన‌ట్లేదు. ఇక భ‌ర‌త్ అనే నేను విష‌యంలో నిర్మాత దాన‌య్య చేస్తోన్న ప‌నుల‌కు అంతా షాక్ అవుతున్నారు. ముందు వెన‌క చూసుకోకుండా ఈ చిత్రానికి ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా క‌లెక్ష‌న్లు వేస్తున్నాడు ఈయ‌న‌. వారం రోజుల్లోనే 161 కోట్ల గ్రాస్ అంటూ ఆ మ‌ధ్య పోస్ట‌ర్ విడుద‌ల చేసి.. విమ‌ర్శ‌ల పాలైన ఈయ‌న ఇప్పుడు మూడు వారాల‌కు త‌మ సినిమా 205 కోట్లు వ‌సూలు చేసింద‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు. అంటే ఈ లెక్క‌న రంగ‌స్థ‌లం కూడా క్రాస్ అయింద‌న్న‌మాట‌. అంటే ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ భ‌ర‌త్ అనే నేను అని ఫిక్సైపోవాలా..? ఒక‌వేళ అదే నిజ‌మైతే భ‌ర‌త్ కు షేర్ ఎంత వ‌చ్చుండాలి.. నిర్మాత చెప్పిన లెక్క ప్ర‌కారం అయితే 130 కోట్ల‌కు పైగా రావాలి. మ‌రి అంత వ‌చ్చిందా అంటే అనుమానమే స‌మాధానం. ఏదో ఊరికే పోస్ట‌ర్ పై ఓ లెక్క చూపించాలి కాబ‌ట్టి అలా వేస్తే ఎలా అంటున్నారు ప్రేక్ష‌కులు. నిజంగా సినిమా హిట్టైనా కూడా ఇలా ఫేక్ రికార్డుల పుణ్య‌మా అని దాని రేంజ్ త‌గ్గుతుందే కానీ పెర‌గ‌దు. ఈ విష‌యం మ‌న నిర్మాత‌ల‌కు ఎప్పటికి అర్థం అవుతుందో..?

More Related Stories