English   

జాను రివ్యూ

Jaanu Movie Review
2020-02-07 13:45:22

ఈ మధ్య కాలంలో 96 సినిమా గురించి జరిగినంత డిస్కషన్ మరే సినిమా గురించి తెలుగులో జరగలేదు. ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారని తెలిసినపుడు కూడా చాలా చర్చ జరిగింది. అనవసరంగా క్లాసిక్ తీసుకుని చెడగొడుతున్నాడంటూ దిల్ రాజుపై కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు జాను వచ్చింది.. ఎలా ఉంది.. ఆకట్టుకుందా లేదా..?

కథ:

రామ్ ఉరఫ్ కే రామచంద్ర (శర్వానంద్) ఓ ట్రావెల్ ఫోటోగ్రఫర్. అనుకోకుండా 17 ఏళ్ళ తర్వాత తను చదువుకున్న స్కూల్‌కు వస్తాడు.. అక్కడి అనుభూతులను మరోసారి గుర్తు చేసుకుంటాడు. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి అంతా మరోసారి కలవాలని కోరతాడు. అంతా ఒప్పుకుంటారు.. వస్తారు కూడా. చివరికి తను ప్రాణంగా ప్రేమించిన జానకి దేవి (సమంత) కూడా వస్తుంది. స్కూల్ డేస్‌లో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న వీళ్లు పరిస్థితుల ప్రభావంతో విడిపోతారు. 17 ఏళ్ళ తర్వాత కలుసుకుని ఏం మాట్లాడకుండా ఉండిపోతారు.. అసలు అప్పుడు ఎందుకు విడిపోయారు.. తర్వాత కలుసుకున్నపుడు ఏం జరుగుతుంది.. అనేది అసలు కథ..

కథనం:

96 సినిమా గురించి చెప్పాలంటే ముందు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండమని సలహా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం రెగ్యులర్‌గా చూడలేం.. అలాంటి కథలు కూడా మళ్లీ రావు.. చేసే ధైర్యం కూడా చేయరు దర్శకులు. ఓ కథను హానెస్ట్‌గా అనుకున్నది అనుకున్నట్లు చూపించడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ సక్సెస్ అయ్యాడు కానీ స్లో నెరేషన్‌తో జానును సాదాసీదా ప్రేమకథగా మార్చేసాడు. 

విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం తమిళంలో క్లాసిక్ అయిపోయింది. కానీ తెలుగులో మంచి సినిమా అవుతుందేమో కానీ గొప్ప సినిమా మాత్రం కాదు. పైగా ఇలాంటి కథలు మనవాళ్లు చూసారు కూడా. ముఖ్యంగా మళ్లీ రావా సినిమా కథ అంతా ఇలాగే ఉంటుంది. జానులో కూడా అక్కడక్కడా మ్యాజిక్ కనిపించింది.. స్కూల్ లవ్ అందరికీ ప్రత్యేకమే.. అలాంటి పాయింట్ మీదే కథ రాసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. విడిపోయిన ప్రేమికులు మళ్లీ 15 ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది అనే లైన్ తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. జానులో అంతకంటే కొత్తగా ఏమీ కనిపించలేదు కానీ.. స్కూల్ డేస్ గుర్తుచేస్తూ దర్శకుడు చేసిన స్క్రీన్ ప్లే మ్యూజిక్ అక్కడక్కడ బాగానే వర్కవుట్ అయినట్టు అనిపించింది. 

ముఖ్యంగా స్కూల్ లవ్ స్టోరీపై బాగా ఫోకస్ చేసాడు దర్శకుడు. అది బాగానే స్క్రీన్ పై ప్రజెంట్ చేసాడు కూడా. పెద్దయ్యాక శర్వానంద్, సమంత కెమిస్ట్రీ చాలా బాగుంది.. ఫస్ట్ హాఫ్ అంతా రి యూనియన్ పార్టీ.. సమంత ఎంట్రీ.. స్కూల్ బ్యాక్ డ్రాప్ తో పర్లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కథను ఎమోషనల్గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎందుకో తెలియదు మరి.. ఈ సినిమా చూస్తుంటే సుమంత్ నటించిన మళ్లీ రావా గుర్తుకొచ్చింది. చాలా సన్నివేశాలు అందులో కనిపించినవే మళ్లీ ఇందులోనూ సేమ్ టు సేమ్ అనిపించాయి. 

ఒరిజినల్ వెర్షన్ ఎలా ఉందో చూడని వాళ్లకు కూడా జాను సినిమా మాత్రం అందరూ చెప్పినంత గొప్పగా అనిపించదు. మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నా కూడా.. స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్.. ఇలాంటి కథలు ఇలాగే ఉంటాయి అని సరిపెట్టుకోవాలేమో మరి.. శర్వానంద్ బాగా నటించాడు.. సమంత కూడా బాగుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ పెళ్లి గురించి మాట్లాడుకునే సీన్ అయితే బాగుంది. స్కూల్ ఏజ్ లో వచ్చే పిల్లలు అందరూ బాగానే నటించారు.. ఓవరాల్ గా 96 చూడని వాళ్లకు జాను పర్లేదు అనిపిస్తుంది. ఎమోషనల్ కథలకు కనెక్ట్ అయ్యే వాళ్లకు జాను మంచి ఛాయిస్.. మంచి సినిమానే కానీ గొప్ప సినిమా అయితే కాదు.

నటీనటులు:

శర్వానంద్ మరోసారి అద్భుతంగా నటించాడు. తన పాత్ర వరకు ప్రాణం పోసాడు. విజయ్ సేతుపతిని మరిపించడం కష్టమే కానీ తనవరకు మాత్రం చాలా బాగా నటించాడు. సమంత అక్కినేని కూడా త్రిష పాత్రను ఓన్ చేసుకుంది. తన మార్క్ చూపించడానికి ప్రయత్నించినా వేషభాషలు అలాగే ఉన్నాయి కాబట్టి ఆ పాత్రలో త్రిష కనిపించింది. వెన్నెల కిషోర్ కొంత వరకు నవ్వించాడు. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్ర మేరకు బాగానే ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:

గోవింద వసంత్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ముఖ్యంగా ఆర్ఆర్ అదరగొట్టాడు. దాంతో పాటు పాటలు కూడా పర్లేదు అనిపించాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ మాత్రం వీక్ అనిపించింది. కాస్త సాగదీసినట్లు అనిపించాయి సన్నివేశాలు. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఎమోషనల్ లవ్ స్టోరీ బాగానే రాసుకున్నాడు కానీ కాస్త వేగంగా ఉంటే ఇంకా బాగుండేది. కానీ ప్రేమకథలు ఇష్టపడే వాళ్లకు జాను నచ్చేస్తుంది కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకు మాత్రం రుచించదు.

చివరగా:

జాను.. హై ఓల్టేజ్ ఎమోషనల్ లవ్ స్టోరీ..

రేటింగ్: 3/5.

More Related Stories