అప్పుడు లెజెండ్.. ఇప్పుడు రంగస్థలం..

ఒకప్పుడు జగపతిబాబు అంటే ఫ్యామిలీ హీరో. శోభన్ బాబు తర్వాత శోభన్ బాబు. సాఫ్ట్ ఇమేజ్ కు ఈయన పెట్టింది పేరు. మధ్యలో కొన్ని మాస్ సినిమాలు చేసినా కూడా ఆయన మాత్రం ఎప్పుడూ క్లాస్ సినిమాలకే ఫేమస్. అలాంటి హీరోను తీసుకొచ్చి లెజెండ్ లో రాక్షసుడిగా చూపించాడు బోయపాటి శీను. లెజెండ్ తర్వాత జగపతిబాబు కెరీర్ ఏ స్థాయిలో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటున్నాడు జగపతిబాబు. ఈయన చేతినిండా సినిమాలున్నాయి ఇప్పుడు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో అన్ని ఇండస్ట్రీల్లోనూ జేబీ నటిస్తున్నాడు. ఇప్పుడు విడుదలైన రంగస్థలంలోనూ జగపతిబాబు కారెక్టర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. లెజెండ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఈ ప్రెసిడెంట్ కారెక్టర్ కు పేరొచ్చిందని చెబుతున్నాడు జగపతిబాబు. తనకు లెజెండ్ బర్త్ అయితే.. రంగస్థలం రీ బర్త్ అని చెప్పాడు ఈ మాజీ హీరో. ఇందులో డబ్బింగ్ చెబుతున్నపుడు సిట్టిబాబుపై తాను మనసు పడ్డానని చమత్కరించాడు జేబీ. ఈ నా కొడుకును సిట్టి బాబు వచ్చి ఎప్పుడు చంపుతాడ్రా బాబూ అనిపించిందని.. ఆ పాత్రను సుకుమార్ అంత రాక్షసంగా తెరకెక్కించాడని చెప్పాడు జగపతిబాబు. ఇక ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఇదే ఫీల్ అవుతున్నారని.. అందుకే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని గుర్తు చేసుకున్నాడు జేబీ. మొత్తానికి రంగస్థలం తర్వాత తన కెరీర్ మరింత వేగం అందుకుందని ఆనందం వ్యక్తం చేసాడు ఈ స్టైలిష్ విలన్. మరి చూడాలిక.. ఈ చిత్రం తర్వాత జేబీ కెరీర్ ఇంకెంత ముందుకు వెళ్తుందో..?