English   

జ‌ంబ ల‌కిడి పంబ‌ రివ్యూ

Jamba-Lakidi-Pamba
2018-06-22 14:16:23

20 ఏళ్ల కింద తెలుగులో వ‌చ్చిన ది బెస్ట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జ‌ంబ ల‌కిడి పంబ‌. ఇవివి తెర‌కెక్కించిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం. మ‌ళ్లీ ఇదే టైటిల్ తో ఇప్పుడు శ్రీ‌నివాస‌రెడ్డి సినిమా చేసాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? అప్ప‌ట్లా ఇప్పుడు కూడా జ‌ంబ ల‌కిడి పంబ మెప్పించిందా..? 

క‌థ‌: వ‌రుణ్ (శ్రీ‌నివాస‌రెడ్డి) సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్. ప‌ల్ల‌వి (సిద్ధి) ఫ్యాష‌న్ డిజైన‌ర్. ఇద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లైన కొన్ని రోజుల‌కే గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. అభిప్రాయ బేధాల‌తో విడాకులకు అప్లై చేస్తారు. వాళ్ల కేస్ ను లాయ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్(పోసాని) డీల్ చేస్తాడు. కానీ అనుకోని పిర‌స్థితుల్లో ఆయ‌న చ‌నిపోతాడు. ఆ త‌ర్వాత ఆత్మ‌గా వ‌చ్చి వ‌రుణ్, ప‌ల్ల‌విని టార్చ‌ర్ చేస్తుంటాడు. అస‌లు ఆయ‌న ఆత్మ ఎందుకు అయ్యాడు..? మ‌ధ్య‌లో జూనియ‌ర్ లాయ‌ర్ (వెన్నెల కిషోర్) ఎందుకు వ‌రుణ్, ప‌ల్ల‌విని టార్చ‌ర్ పెడుతుంటాడు అనేది అస‌లు క‌థ‌..!

క‌థ‌నం: జ‌ంబ ల‌కిడి పంబ.. తెలుగు ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్స్ లో ఒక‌టి. ఇవివి తెర‌కెక్కించిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం. ఇన్నేళ్లు అల్ల‌రి న‌రేష్ కూడా ఈ సినిమా గురించి ఆలోచించ‌లేదు. కానీ ఇప్పుడు శ్రీ‌నివాస‌రెడ్డి జ‌ంబ ల‌కిడి పంబ టైటిల్ తో సినిమా చేసాడు. క‌థ సేమ్ కాక‌పోయినా కాన్సెప్ట్ మాత్రం అదే. ఆ జ‌ంబ ల‌కిడి పంబలో మ‌గ ఆడ కాకుండా ఇంకా మూడు నాలుగు ఫేజ్ లు ఉంటాయి. కానీ ఈ జ‌ంబ ల‌కిడి పంబ‌లో మాత్రం కేవ‌లం ఆడ మ‌గ కాన్సెప్ట్ మాత్ర‌మే తీసుకున్నాడు. అందులో ప్ర‌తీ సీన్ క‌డుపులు చెక్క‌లు చేస్తుంది. ముఖ్యంగా ఆడ మ‌గా మారిపోయిన‌పుడు కూడా ఎక్క‌డా వెగ‌టు పుట్ట‌కుండా కామెడీ డీల్ చేసాడు ఇవివి. బ్ర‌హ్మానందంతో పాటు కోట లాంటి వాళ్ళ‌తో ఆయ‌న చేయించిన కామెడీ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. కానీ ఇక్క‌డ కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డంతో ప్ర‌తీ చోటా వెలితి క‌నిపించింది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌తో ప్రేక్ష‌కుల త‌ల‌కు బొప్పి క‌డుతుంది. ప‌ర్లేదులే అస‌లు కాన్సెప్ట్ మొద‌లైన త‌ర్వాత కామెడీ వ‌స్తుందేమో అనుకుంటే అస‌లు న‌ర‌కం అప్ప‌ట్నుంచే మొద‌ల‌వుతుంది. మ‌రీ ముఖ్యంగా శ్రీ‌నివాస‌రెడ్డిని అమ్మాయిగా అస్స‌లు చూడ‌లేరు ప్రేక్ష‌కులు. అమ్మాయి పాత్ర‌లో పెద్ద‌గా తేడా క‌నిపించ‌దు. ఆమెది జెండ‌ర్ మార‌క ముందు కూడా టామ్ బాయ్ లాగే ఉండ‌టం వ‌ల్లో ఏమో కానీ ఆ తేడా క‌నిపించ‌దు. క్లైమాక్స్ వ‌ర‌కు శ్రీ‌నివాస‌రెడ్డిని జ‌ంబ ల‌కిడి పంబ కాన్సెప్ట్ తో చూడ‌లేక ప్రేక్ష‌కుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు. చ‌చ్చిపోయిన లాయ‌ర్ కు స్వ‌ర్గంలో భార్య ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే విడిపోయే వీళ్లిద్ద‌ర్ని క‌లిపాలి అని దేవుడు కండీష‌న్ పెట్ట‌డం వింత‌గా అనిపించినా.. దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం అస్స‌లు ఆక‌ట్టుకోలేదు. దాంతో జ‌ంబ ల‌కిడి పంబ కాస్తా పంబ జంబ లంబ ల‌కిడి అయిపోయింది.

న‌టీన‌టులు:  శ్రీ‌నివాస‌రెడ్డి కమెడియ‌న్ గా ఇప్ప‌టికే పాపుల‌ర్. ఆయ‌న కామెడీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ జ‌ంబ ల‌కిడి పంబ కాన్సెప్ట్ మాత్రం ఈయ‌న‌కు అస్స‌లు సూట్ కాలేదు. అమ్మాయి వేశంలో అస‌లు శ్రీ‌నివాస‌రెడ్డిని చూడ‌టం కూడా వెగ‌టుగా అనిపిస్తుంది. కొత్త హీరోయిన్ సిద్ధి బానే చేసింది. ఈమె జెండర్ మారిన త‌ర్వాత కూడా తేడా అనిపించ‌దు. పోసాని లాయ‌ర్ గా న‌వ్వులు పూయించాడు. అక్క‌డ‌క్క‌డా ఈయ‌నే కాస్త న‌వ్వు తెప్పించాడు. వెన్నెల కిషోర్ కూడా ప‌ర్లేదు. హ‌రితేజ‌.. త‌ణికెళ్ల.. ర‌ఘుబాబు వీళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే.

టెక్నిక‌ల్ టీం:  నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ సినిమాల‌కు సంగీతం అందించిన గోపీసుంద‌రేనా ఈ సినిమాకు కూడా సంగీతం అందించాడు అనిపిస్తుంది పాట‌లు వింటుంటే. ఒక్క‌టి కూడా పెద్దగా ఆక‌ట్టుకోలేదు. టైటిల్ సాంగ్ మాత్రం ప‌ర్లేద‌నిపిస్తుంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఎందుకంటే అక్క‌డ చూపించ‌డానికి కూడా విజువ‌ల్స్ ఏం లేవు. ఎడిటింగ్ వీక్. రెండు గంట‌ల 21 నిమిషాల సినిమా బోర్ కొడుతుంది. మ‌ధ్య‌లో కొన్ని సీన్లు చిరాకు కూడా తెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడిగా తొలి సినిమాకే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవ‌డం ముర‌ళీకృష్ణ చేసిన సాహ‌స‌మే అయినా.. దాన్ని డీల్ చేయ‌డంలో మాత్రం విఫ‌లం అయ్యాడు. 

చివ‌ర‌గా:  జ‌ంబ ల‌కిడి పంబ‌.. భ‌రించ‌డం క‌ష్టం బాసూ..!

రేటింగ్: 2/5

More Related Stories