జాతిరత్నాలు రివ్యూ

ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన రెండో సినిమా జాతిరత్నాలు. ఈ సినిమా లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో నవీన్ పొలిశెట్టి కి హీరోయిన్ గా ఫరీద్ అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలోని చిట్టి సాంగ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం. సినిమాకు ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేయడం తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య శివరాత్రి కానుకగా విడుదలైన జాతిరత్నాలు ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.
కథ : శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) లైఫ్లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్లతో ఛాలెంజ్ చేసి జోగిపేట నుంచి హైదరాబాద్కి వస్తారు. ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ ఎమ్మెల్యే హత్య కు స్కెచ్ వేశారంటూ జైల్లో పెడతారు. ఆ కేసు నుంచి బయటపడటానికి వీళ్లు చేసిన ప్రయత్నాలేంటి.. తర్వాత జరిగిన పరిణామాలేంటి అన్నది మిగతా కథ.
కథనం: ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా ఆద్యంతం వినోదం పంచడమే లక్ష్యంగా కొనసాగుతుంటుంది. అలాగని కథలో ఎక్కడా బలవంతంగా ఇరికించిన కామెడీ ట్రాక్లు ఉండవు. శ్రీకాంత్, శేఖర్, రవిల పాత్రల్ని దర్శకుడు తీర్చిదిద్దుకున్న విధానంలోనే చక్కటి వినోదం నిండి ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్ధంలో అయితే ఈ సినిమా నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. ముగ్గురు హీరోలు ఎవరికి ఎవరూ తక్కువ కాకుండా ప్రేక్షకులకు గిలిగింతలు పెడతారు. వాళ్లకంటూ ఒక్కో స్పెషల్ క్యారెక్టరైజేషన్.. మేనరిజమ్స్ పెట్టడం కామెడీకి మరింతగా దోహదపడింది. ద్వితీయార్ధంలో ఒక దశ దాటాక కొంచెం శ్రుతి మించిన భావన కలుగుతుంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ నుంచి తెరపై ‘సిల్లీతనం’ హద్దులు దాటినట్లనిపిస్తుంది. లాజిక్ పూర్తిగా పక్కకు వెళ్లిపోతుంది. సీరియస్గా సాగాల్సిన సన్నివేశాల్ని కాస్త పకడ్బందీగా రాసుకునే ప్రయత్నం చేస్తే ద్వితీయార్ధం, క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండేవి.
నటీనటులు: సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టి భుజాలమీదే మోసాడు. అమాయకత్వంలోనే హీరోయిజం చూపించడం వల్ల సగటు ప్రేక్షకుడు ఆ పాత్రకి ఎమోషనల్ గా కనెక్ట్ అవడం సహజం. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ ఈ తరానికి బెస్ట్ కమెడియన్లు అనిపించారు. ఇప్పటి యువతకు బాగా నచ్చేలా తమదైన శైలిలో నవ్వులు పంచారు. సినిమా అంతటా ఈ ముగ్గురిదే హవా. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తన టిపికల్ అందంతో ఆకట్టుకుంది. ఆమె రెగ్యులర్ హీరోయిన్లతో పోలిస్తే భిన్నంగా అనిపిస్తుంది. బ్రహ్మానందంని చూపించిన విధానం బాగుంది. ఆయన పాత్ర పరిధి తక్కువే అయినా.. కనిపించిన ప్రతిసారీ నవ్విస్తారు. ఇక మురళీ శర్మ, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ పాత్రలు పరిధి మేర చక్కగా ఆకట్టుకుంటాయి.
టెక్నికల్ టీం: చిట్టి నీ నవ్వే.. పాట చాలా బాగుంది. ఆ పాట అప్పుడే అయిపోయిందా.. ఇంకాసేపు ఉంటే బాగుండే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నాగ్ అశ్విన్ అభిరుచి సినిమా అంతటా కనిపిస్తుంది. సిద్ధం మనోహర్ ఛాయాగ్రహణం సినిమాకి మంచి రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ మాత్రం చాలా పూర్ గా ఉంది. కొన్ని చోట్ల సీన్ పూర్తవకుండా మధ్యలోనే జంప్ కొట్టినట్టుగా అనిపించింది.
చివరిగా: జాతిరత్నాలు.. 'నవ్వించే' రత్నాలు
రేటింగ్- 3/5