English   

రంగ‌స్థ‌లంపై ఎన్టీఆర్ ప్రశంస‌ల వ‌ర్షం.. 

NTR-rangasthalam

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ విన్నా రంగ‌స్థ‌లం గురించే చ‌ర్చ‌. ఎందుకంటే ఆ సినిమాను సుకుమార్ తెర‌కెక్కించిన తీరు.. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తీరు అలా ఉంది మ‌రి. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ కెరీర్ మొద‌లై ప‌దేళ్లైంది కానీ ఎవ‌రూ నువ్వు బాగా న‌టించావ్ అంటూ ఏ ఒక్క‌రు కూడా ట్వీట్ చేయ‌లేదు. హిట్స్ వ‌చ్చిన‌పుడు కంగ్రాట్స్ వ‌చ్చాయి కానీ ప‌ర్స‌న‌ల్ గా న‌ట‌న‌కు మాత్రం ప్ర‌శంస‌లు రాలేదు. కానీ ఇప్పుడు వ‌స్తున్నాయి. రంగ‌స్థ‌లం చూసిన త‌ర్వాత ఒక్కొక్క‌రుగా త‌మ మ‌న‌సులో ఉన్న భావాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. తాను మ‌గ‌ధీర అప్పుడు చూసిన చ‌ర‌ణ్.. ఇప్పుడు చూసిన సిట్టి బాబు ఒక్క‌టి కాదంటూ ట్వీట్ చేసాడు రాజ‌మౌళి. ఇక శ‌ర్వానంద్.. అల్లుఅర్జున్.. శిరీష్.. కొర‌టాల శివ‌.. ఇలా ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తీఒక్క‌రు కూడా రంగ‌స్థ‌లం చూసి త‌మ అభిప్రాయాల‌ను చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ లిస్ట్ లో చేరిపోయాడు. 

జూనియ‌ర్ కూడా త‌న మ‌న‌సులో మాట ట్వీట్ చేసాడు. ఇప్పుడే రంగస్థలం చూశాను. హ్యాట్సాఫ్‌ చరణ్‌. ఇప్పుడు నీకు వ‌స్తోన్న ఈ అప్లాజ్ స‌రైందే.. అంద‌రి మాదిరే నా నుంచి కూడా ఓ ప్ర‌శంస అందుకో బ్ర‌ద‌ర్.. సిట్టాబాబుగా నీ కంటే ఎవ‌రూ బాగా చేయ‌లేరు.. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపిన సుకుమార్‌కు అభినందనలు. అప్పటి కాలానికి తగినట్లు ఓ ఎమోష‌న‌ల్ సినిమాను అందించి.. దాన్ని ఇంత అద్భుతంగా తెర‌కెక్కించిన మీ ధైర్యానికి అభినందనలు. సమంత, దేవీ శ్రీ ప్రసాద్‌.. మైత్రి మూవీస్‌.. రంగస్థలం చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. మీ కారణంగానే చిత్రం ఈ స్థాయిలో ఉంది. మీరంతా అత్యద్భుతంగా పనిచేశారు అంటూ ట్వీట్‌ చేశాడు ఎన్టీఆర్. దీనికి వెంట‌నే రామ్ చ‌ర‌ణ్ కూడా థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ అంటూ రిప్లై ఇచ్చాడు. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ రాజ‌మౌళి సినిమాలో క‌లిసి న‌టించ‌బోతున్నారు. 

More Related Stories