English   

తెలుగులో మరో సెన్షేషనల్ బయోపిక్ 

k.vishwanath
2018-07-28 12:52:51


ఇది బయోపిక్కుల కాలం.. వరుసగా బయోపిక్స్ వస్తున్నాయి. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించింది. ఇప్పుడు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ తరం నటుడు కాంతారావు బయోపిక్ కు కూడా రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని మరో బయోపిక్ మొదలైంది. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ బయోపిక్ కు సంబంధించి నిన్నటి వరకూ చిన్న ఊసు కూడా వినిపించకపోవడం.. పైగా ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఈ బయోపిక్ వస్తుండటం. మరి ఆ బయోపిక్ ఎవరిదో తెలుసా.. కళాతపస్వి కె విశ్వనాథ్ ది. యస్.. దర్శకుడుగా తెలుగు తెరపై తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉండే ముద్ర వేసిన అరుదైన దర్శకుడుగా విశ్వనాథ్ కీర్తి నిలిచిపోతుంది. అలాంటి దర్శకుడుకి సంబంధించి బయోపిక్ వస్తుందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది.. 

ఇక ఈసినిమాకు మాటల రచయిత జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సినిమా టైటిల్ ‘విశ్వదర్శనం’. మరి ఈ విశ్వదర్శనంలో కె విశ్వనాథ్ గా ఎవరు నటిస్తారు.. అలాగే ఇతర పాత్రల్లో కనిపించే ఆర్టిస్టులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియజేస్తారట. 

1950ల చివర్లో తెలుగు పరిశ్రమకు వచ్చారు కె విశ్వనాథ్. మొదటి రికార్డింగ్ స్టూడియోలో పనిచేశారు. తర్వాత అసిస్టెంట్ గా డైరెక్టర్ గా ఆదుర్తి సుబ్బారావు వద్ద చేరారు. కొద్ది కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదుర్తి వద్ద పనిచేస్తున్నప్పుడే అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. విశ్వనాథ్ టాలెంట్ చూసిన అక్కినేని దర్శకుడుగా తొలి అవకాశం ఇచ్చారు. అన్నపూర్ణ బ్యానర్ లో రూపొందిన ఆయన మొదటి సినమా ఆత్మగౌరవం. అప్పటి నుంచి తెలుగు సినిమాకు ఆత్మగౌరవం అని చెప్పదగ్గ కళాఖండాలెన్నో సృష్టించారు. సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణ కమలం, శృతిలయలు, సిరివెన్నెల, స్వాతికిరణం వంటి కలికితురాళ్లెన్నో ఉన్నాయి. 

శుభసంకల్పం నుంచి నటుడుగానూ మారారు. తెలుగులో కొన్నాళ్ల పాటు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు.. మరి ఈ బయోపిక్ లో వివాదాస్పద అంశాలైతే ఉండకపోవచ్చు కానీ.. నాటి కాలపు విశేషాలు మాత్రం బోలెడు ఉండే అవకాశం ఉంది. 

More Related Stories