English   

కాలా రివ్యూ

Kaala Movie Review
2018-06-07 14:35:54

ఓ సారి ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కున్ని అంత ఈజీగా న‌మ్మ‌రు హీరోలు. క‌నీసం ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌రు. కానీ రంజిత్ లాంటి కుర్ర ద‌ర్శ‌కుడికి వ‌ర‌స‌గా రెండో సారి అవ‌కాశం ఇచ్చాడు ర‌జినీ. మ‌రి ఈ ఆఫ‌ర్ ను ఈయ‌న ఉప‌యోగించుకున్నాడా.. క‌బాలి గాయాన్ని కాలాతో పూడ్చాడా..? 

క‌థ‌: కాలా అలియాస్ క‌రికాలన్(ర‌జినీకాంత్) ధారావికి నాయ‌కుడు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఈయ‌న ఎంత చెబితే అంత‌. ఈయ‌న్ని కాద‌ని అక్క‌డేం జ‌ర‌గ‌దు. రాజ‌కీయ నాయ‌కులు కూడా కాలా కాళ్ల‌ద‌గ్గ‌రే ఉంటారు. అలాంటి ధారావిపై రూలింగ్ పార్టీ పొలిటిక‌ల్ లీడ‌ర్ హ‌రిదాదా(నానా ప‌టేక‌ర్) క‌న్ను ప‌డుతుంది. ధారావిలో స్ల‌మ్ ను ఖాళీ చేయించి అక్క‌డ ఓ కాంప్లెక్స్ క‌ట్టాల‌ని ఆలోచిస్తుంటాడు. దానికోస‌మే విదేశాల నుంచి ఆ ప్రాజెక్ట్ విష‌యంలో జ‌రీనా(హ్యూమ‌ఖురేషి) ను తీసుకొస్తుంది ప్ర‌భుత్వం. ఆమె కాలాకు మాజీ ప్రేమికురాలు. కానీ ప్రాజెక్ట్ విష‌యంలో జ‌నాల‌కు అన్యాయం జ‌రుగుతుందని ప్ర‌తీసారి అడ్డు ప‌డుతుంటాడు కాలా. చివ‌రికి కాలా, హ‌రిదాదా మ‌ధ్య‌లో పోరు ఎక్క‌డ అంతం అయింది అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: స‌మాజంలో జ‌రిగే కొన్ని అంశాలు కొంద‌రు ద‌ర్శ‌కుల‌పై చాలా ప్ర‌భావం చూపిస్తుంటాయి. రంజిత్ కూడా ఇంతే. ఈయ‌న బేసిగ్గా బాగా అణ‌గారిన వ‌ర్గం నుంచి వ‌చ్చాడు. జీవితంలో ఈయ‌న చాలా క‌ష్టాలు కూడా ప‌డ్డాడు. పైగా చాలా మంది వీళ్ల‌పై జులూం కూడా చూపించారు. రియ‌ల్ లైఫ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఈయ‌న‌పై ఎంత ప్ర‌భావం చూపించాయో ఈయ‌న సినిమాలు చూస్తుంటే అర్థ‌మైపోతుంది. తొలి సినిమా అట్టాక‌త్తి నుంచి కాలా వ‌ర‌కు అన్నింట్లోనూ అణిచివేయ‌బ‌డిన ప్ర‌జ‌ల త‌ర‌ఫునే పోరాడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. కాలాలో కూడా ఇదే చూపించాడు. ఈ సినిమాలో ధారావిని క‌థాంశంగా తీసుకున్నాడు. క‌బాలిలో మ‌లేషియ‌న్ త‌మిళుల గురించి చెబితే ఈ సారి ముంబైలోని త‌మిళుల గురించి చెప్పాడు. అయితే చేతిలో ర‌జినీకాంత్ లాంటి న‌టుడు ఉన్న‌పుడు క‌థ‌ను ఎంత వేగంగా.. అందంగా చెప్పాల‌నుకోవాల‌నేది ద‌ర్శ‌కుడికి తెలియాలి. గ‌తంలో చాలా మంది ద‌ర్శ‌కులు ర‌జినీని ఇలా వాడుకుని సూప‌ర్ హిట్స్ ఇచ్చారు. 

క‌థ రాయ‌డంలో ఉన్న ప‌ట్టు.. తీయ‌డంలో చూపించ లేక‌పోతున్నాడు రంజిత్. క‌బాలిలో చేసిన త‌ప్పే మ‌రోసారి కాలాలోనూ చేసాడు రంజిత్. ఈ సారి కూడా సీన్స్ మ‌రీ స్లోగా వెళ్ల‌డం.. హ్యూమాతో ర‌జినీ ప్రేమాయ‌ణం కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా నెమ్మ‌దిగా సాగే ఈ స్క్రీన్ ప్లేతో సినిమాలో ఉన్న‌ అస‌లు క‌థ ప‌క్క‌దోవ ప‌డుతుంది. క‌థ‌లోకి వ‌చ్చిన‌పుడు మ‌ళ్లీ ఆస‌క్తి క‌లిగి వెంట‌నే మ‌ళ్లీ ఇంకో సీన్ తో ప‌క్క‌దారికి వెళ్తుంది. ఫ‌స్టాఫ్ లో ఇంట‌ర్వెల్ కు ముందు వ‌చ్చి ఫ్లైఓవ‌ర్ ఫైట్ సీన్.. సెకండాఫ్ లో పోలీస్ స్టేష‌న్ సీన్.. నానా ప‌టేక‌ర్ తో వ‌చ్చే సీన్స్ అన్నీ అద్భుతంగా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. కానీ ఇదే పేస్ సినిమా అంతా కొన‌సాగ‌లేదు. అదే అస‌లు మైన‌స్. క్లైమాక్స్ మ‌ళ్లీ దారిన ప‌డినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. క‌థ‌లో చాలా వ‌ర‌కు నాయ‌కుడు సినిమాతో పోలిక‌లు క‌నిపించాయి. ఓవ‌రాల్ గా మ‌రోసారి యావ‌రేజ్ సినిమాతోనే వ‌చ్చాడు రంజిత్.

న‌టీన‌టులు: ర‌జినీకాంత్ న‌ట‌న గురించి కొత్తగా చెప్ప‌డానికి ఏంలేదు. కాలాగా ఆయ‌న ర‌ప్ఫాడించాడు. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో న‌డిపించాడు. నాయ‌కుడి పాత్ర‌లో ఆయ‌న కంటే ఎవ‌రు బాగా న‌టిస్తారు. నానా ప‌టేక‌ర్ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడు. ఆయ‌న ప్ర‌తీ సీన్ లోనూ త‌న అద్భుత‌మైన న‌ట‌న చూపించాడు. హ్యూమాఖురేషి ప‌ర్లేదు. ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఇక ర‌జినీ భార్య‌గా ఈశ్వ‌రీరావు మ‌రీ త‌మిళ న‌టి లా అనిపించింది. ఓవ‌ర్ యాక్ష‌న్ అనిపించింది ఆమె డైలాగులు. శియాజీషిండే, సంప‌త్ కుమార్ ప‌ర్లేదు. 

టెక్నిక‌ల్ టీం: సంతోష్ నారాయ‌ణ్ సంగీతం మ‌రోసారి క‌బాలిని త‌ల‌పించింది. అవే ట్యూన్స్ రిపీట్ అయిన‌ట్లు అనిపించినా.. కొన్ని సీన్లకు మాత్రం చాలా బాగా బ్యాంగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆయ‌న ఆర్ఆర్ తో స‌న్నివేశాలు బాగానే హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కాస్త వీక్. రెండు గంట‌ల 50 నిమిషాల సినిమా కావ‌డంతో మ‌ధ్య‌లో కొన్ని సీన్స్ తీసెయొచ్చేమో అనిపిస్తుంది. త‌మిళ్ లో ఓకే కానీ తెలుగులో అది వ‌ర్క‌వుట్ అవ్వ‌దు. ద‌ర్శ‌కుడిగా రంజిత్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. క‌థ విష‌యంలో ఓకే కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. అదే మైన‌స్. ఆయ‌న చెప్పాల‌నుకున్న క‌థ మంచిదే అయినా నెమ్మ‌దిగా రాసుకోవ‌డం ప్ర‌తికూలం.

చివ‌ర‌గా: కాలా.. న‌లుపులో న‌లిగిపోయింది.. 

రేటింగ్: 2.5/5

More Related Stories