English   

కాశి రివ్యూ

Kaasi-Review
2018-05-18 12:58:22

విజ‌య్ ఆంటోనీ సినిమా అంటే క‌చ్చితంగా ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌నే అంచ‌నాలు.. ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క‌లిగించాడు ఈ హీరో. దానికి కార‌ణం డాక్ట‌ర్ స‌లీమ్, న‌కిలీ.. ఆ త‌ర్వాత బిచ్చ‌గాడు. ఇక ఇప్పుడు కూడా ట్రైల‌ర్ లోనే పాము, ఎద్దుల‌ను చూపించి కాశీ సినిమాపై ఆస‌క్తి పెంచేసాడు. మ‌రి ఆయ‌న చెప్పినంత రేంజ్ లో క‌థ ఉందా..?

క‌థ‌: భ‌ర‌త్(విజ‌య్ ఆంటోనీ) అమెరికాలో అమ్మానాన్న‌ల‌తో ఉంటాడు. అక్క‌డ ఆయ‌న ఓ పెద్ద డాక్ట‌ర్. రోజూ క‌ల‌లో పాము, ఎద్దు వ‌స్తుంటాయి. ఓ రోజు భ‌ర‌త్ వాళ్ల అమ్మ‌కు కిడ్నీ ఫెయిల్యూర్స్ ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో కిడ్నీ ఇవ్వాల‌నుకుంటాడు కానీ అది మ్యాచ్ కాద‌ని తెలుస్తుంది. అప్పుడే వాళ్లు త‌న‌కు అస‌లైన అమ్మానాన్న‌లు కాద‌ని తెలుస్తుంది భ‌ర‌త్ కు. అస‌లు తన త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. వాళ్లెక్క‌డ ఉంటారు అని తెలుసుకోడానికి ఇండియాకు వ‌స్తాడు భ‌ర‌త్. ఆ క్ర‌మంలో త‌న పేరు భ‌ర‌త్ కాద‌ని కాశీ అని తెలుస్తుంది. అస‌లేం జ‌రిగింది..? ఎందుకు ఆ పాము, ఎద్దు వ‌స్తుంటాయి అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: ఓ ఎద్దు.. దాన్ని మింగ‌డానికి వ‌చ్చే  పాము.. అక్క‌డే ఆడుకుంటున్న చిన్న పిల్లోడు.. ఇది కాశీ ట్రైల‌ర్ లో మ‌న‌కు క‌నిపించేవి. ఇది చూసిన త‌ర్వాత మ‌ళ్లీ విజ‌య్ ఆంటోనీ ఏదో కొత్త‌గా ట్రై చేసాడు అనిపిస్తుంది. కానీ అస‌లు క‌థ మాత్రం మ‌రోలా ఉంటుంద‌ని థియేటర్ లోప‌లికి వెళ్లిన త‌ర్వాతే అర్థం అవుతుంది. ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ చెప్ప‌కుండా ఎక్క‌డెక్క‌డో తిప్పుతుంటాడ‌ని సినిమా మొద‌లైన 15 నిమిషాల‌కే మ‌న‌కు అర్థ‌మైపోతుంది. త‌న త‌ల్లి ఎవ‌రో తెలుసుకున్న హీరో తండ్రి కోసం ఓ ఊరుకు డాక్ట‌ర్ గా రావ‌డం.. అక్క‌డ త‌న‌కు అనిపించిందంతా చేయ‌డం.. క‌నిపించిన వాళ్లంద‌ర్నీ అనుమా నించ‌డం చేస్తాడు. ఈ క్ర‌మంలోనే పిచ్చి పిచ్చి సీన్స్ అన్నీ అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. అర్థం ప‌ర్థం లేని కామెడీతో చిరాకు పుట్టిస్తాడు. క‌మెడియ‌న్ మాట్లాడే చాలా మాట‌లు డ‌బుల్ మీనింగ్ లోనే ఉంటాయి. ఫ‌స్టాఫ్ లో అక్క‌ర్లేని ఓ ప్రేమ‌క‌థ చూపించి.. సెకండాఫ్ లోనూ అలాంటి క‌థే ఒక‌టి రాసుకున్నాడు. 

అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌కుండా అడ్డొచ్చిన వాళ్లంద‌ర్నీ క‌థ‌లు చెప్ప‌డం.. అందులోకి హీరో పాత్ర‌ను దూర్చ‌డం.. ఇదే స‌రిపోయింది సినిమా అంతా. రెండు ముక్క‌ల్లో తేలిపోయే క‌థ‌ను రెండు గంట‌ల పాటు సాగించాడు ద‌ర్శ‌కుడు. చివ‌ర్లో క‌థ చెప్పిన త‌ర్వాత ప్రేక్ష‌కుడు కూడా ఇదే ఫీల్ అవుతాడు. ఏముంది సినిమాలో.. దీనికోస రెండు గంట‌లెందుకు సాగ‌దీయ‌డం అని..! ఫ‌స్టాఫ్ లో హీరో కాకుండా మ‌రో ప్రెసిడెంట్ ప్రేమ‌క‌థ‌.. సెకండాఫ్ లో ఓ దొంగ క‌థ‌.. రెండూ అస‌లు క‌థ‌కు అస్స‌లు సంబంధం లేని క‌థ‌లే. వాటిని తీసుకొచ్చి మెయిన్ క‌థ‌కు జోడించాడు ద‌ర్శ‌కుడు. అదెందుకో ఆయ‌న‌కే తెలియాలి మ‌రి..! ఇక అస‌లైన క‌థ చివ‌రి 15 నిమిషాల్లో చెప్తాడు. కానీ అప్ప‌టికే అంద‌రికీ ఆ క‌థేంటి అనేది అర్థ‌మైపోతుంది. అప్ప‌టికి చెప్పినా లాభం లేదు. మొత్తానికి విజ‌య్ ఆంటోనీ ఈ సారి మాత్రం పూర్తిగా మోస‌పోయాడు.. క‌థ లేని ఓ క‌థ‌ను ఎంచుకుని ఎటూ కాకుండా పోయాడు.

న‌టీన‌టులు: విజ‌య్ ఆంటోనీ బాగానే చేసాడు. ఆయ‌న ఎప్పుడూ ఆర్ద్ర‌త‌తో కూడిన పాత్ర‌లే చేస్తుంటాడు. అమ్మ‌కు దూర‌మైన పాత్ర‌లు.. జీవితంలో ఓడిపోయిన పాత్ర‌లు.. ఇలాంటి సింప‌తీ వ‌చ్చే పాత్ర‌లే చేస్తుంటాడు. ఈ సారి కూడా ఇదే చేసాడు. అంజ‌లి ఎందుకు ఉందో ఆమెకే అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి మాయ‌మైపోతుంటుంది. మ‌రో హీరోయిన్ శిల్పా మంజునాథ్ పాత్ర కూడా అంతే. రెండు ల‌వ్ స్టోరీస్ కోసం ముగ్గురు హీరోయిన్ల‌ను తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. నాజ‌ర్, జ‌య‌ప్ర‌కాశ్ కూడా క‌థ‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చే పాత్ర‌లే. 

టెక్నిక‌ల్ టీం:  విజ‌య్ ఆంటోనీ సంగీతం అర‌వ మేళంగా మారిపోయింది. ఒక్క పాట కూడా మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డం క‌ష్ట‌మే. బ్యాగ్రౌండ్ స్కోర్ ప‌ర్లేదు. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఊళ్లోనే సినిమా తెర‌కెక్కించారు కాబ‌ట్టి పెద్ద‌గా చూపించ‌డానికి కూడా ఏం లేదు. ఎడిటింగ్ చాలా వీక్. చాలా సీన్లు క‌ట్ చేయొచ్చేమో అనిపించింది. రెండు గంట‌ల 14 నిమిషాల సినిమా కూడా మూడు గంట‌ల సినిమాలా సాగిపోయింది. ద‌ర్శ‌కుడు కృతుంగ ఉద‌య‌నిధి క‌థ ఎక్క‌డో మొద‌లుపెట్టి ఎక్క‌డో ఆపాడు. మ‌ధ్యలో ఇంకొన్ని క‌థ‌లు జోడించాడు. క‌న్ఫ్యూజ‌న్ లేకుండా చెప్పాడు కానీ క‌థ‌కు అక్క‌ర్లేని క‌థ‌ల‌న్నీ చూపించాడు. అదే అస‌లు బాధ‌. 

చివ‌ర‌గా: కాశీ.. టైటిల్ కు త‌గ్గ‌ట్లే పోయిందిగా కాశీ..!

రేటింగ్: 2/5

More Related Stories